TSPSC Paper Lekage Case: రేవంత్, బండి సంజయ్‌లకు కేటీఆర్ లీగల్ నోటీసులు.. రూ.100 కోట్ల పరువు నష్టం దావా!

TSPSC Paper Lekage Case: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీక్ కేసులో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి మంత్రి కేటీఆర్ లీగల్ నోటీసులు పంపారు. ఇద్దరూ బహిరంగ క్షమాపణ చెప్పకపోతే వంద కోట్ల రూపాయలకు పరువు నష్టం దావా వేస్తున్నట్లు ప్రకటించారు. టీఎస్‌పీఎస్సీ వ్యవహారంలో రాజకీయ దురుద్దేశంతోనే తన పేరును అనవసరంగా లాగుతున్నారని, వీరిద్దరికి తన న్యాయవాది ద్వారా లీగల్ నోటీసులను పంపించారు.
సుదీర్ఘ కాలం పాటు ప్రజా జీవితంలో ఉన్న తన పరువుకు భంగం కలిగించాలన్న దురుద్దేశంతోనే బండి సంజయ్, రేవంత్ రెడ్డి పదేపదే అబద్దాలను మాట్లాడుతున్నారని కేటీఆర్ చెప్పారు. కేవలం ప్రజాప్రతినిధిగా ఉన్నంత మాత్రాన ఎదుటి వారి పైన అసత్య ప్రచారం చేసే హక్కు వీరికి లేదన్నారు. ఇండియన్ ఐపీసీలోని 499, 500 నిబంధనల ప్రకారం పరువు నష్టం దావా నోటీసులు పంపించారు. ఎలాంటి ఆధారాలు లేని సత్య దూరమైన ఆరోపణలను మానుకోవాలని, ఇప్పటికే చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలని నోటీసులో డిమాండ్ చేశారు.
వారం రోజులలోగా తమ వ్యాఖ్యలను వెనకకు తీసుకొని క్షమాపణ చెప్పకుంటే 100 కోట్ల రూపాయల పరువు నష్టం దావాను ఎదుర్కోవాల్సి వస్తుందని కేటీఆర్ తన నోటీసులో పేర్కొన్నారు. టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ అంశంలో మంత్రి కేటీఆర్ కార్యాలయానికి సంబంధం ఉందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. అంతేకాదు ఈ కేసుతో మంత్రి రేవంత్ రెడ్డికి సంబంధం ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. ఈ కేసులో మంత్రి కేటీఆర్ ను మంత్రివర్గం నుండి భర్తరఫ్ చేయాలని కూడా కాంగ్రెస్, బీజేపీ నేతలు డిమాండ్ చేశారు.
ఈ క్రమంలోనే మంత్రి కేటీఆర్ రేవంత్, సంజయ్ లకు నోటీసులు పంపించారు. సుదీర్ఘకాలం పాటు ప్రజా జీవితంలో ఉన్న నా పరువుకు భంగం కలిగించాలన్న దురుద్దేశంతో పదే పదే అబద్ధాలు మాట్లాడుతున్నారని.. ఐపీసీ సెక్షన్లు 499, 500 ప్రకారం పరువు నష్టం దావాకు నోటీసులు పంపించా. ఎలాంటి ఆధారాలు లేని సత్యదూరమైన ఆరోపణలు మానుకోని.. బహిరంగ క్షమాపణ చెప్పాలని.. లేని పక్షంలో రూ.100 కోట్లకు పరువు నష్టం దావాను ఎదుర్కోవాలని కేటీఆర్ వెల్లడించారు.