Hit by Train: దూసుకొచ్చిన మృత్యువు.. నెల్లూరులో రైలు ఢీకొని ముగ్గురు మృతి!

Kaburulu

Kaburulu Desk

January 22, 2023 | 09:19 AM

Hit by Train: దూసుకొచ్చిన మృత్యువు.. నెల్లూరులో రైలు ఢీకొని ముగ్గురు మృతి!

Hit by Train: ఏపీలోని నెల్లూరు జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. రైల్వే బ్రిడ్జిపై రైలు ఢీకొని ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ విషాద ఘటన శనివారం రాత్రి జరిగింది. నగరంలోని ఆత్మకూరు బస్టాండ్‌ వద్ద నున్న రైల్వే బ్రిడ్జిపై ఇద్దరు పురుషులు, ఒక మహిళ వస్తుండగా- గూడూరు వైపు నుంచి విజయవాడ వెళుతున్న నర్సాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు పురుషులు, ఓ మహిళ మృతి చెందింది.

సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు.. మృతదేహాలను జిల్లా ఆసుపత్రికి తరలించి.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ సంఘటనలో ఇద్దరు పురుషులు రైలు పట్టాలపైనే మృతి చెందగా.. మహిళ పట్టాలపై నుంచి కిందపడి చనిపోయినట్లు భావిస్తున్నారు. మరణించిన ముగ్గురూ 45- 50 ఏళ్లలోపు వారేనని అర్ధమవుతుండగా.. వారి
చేతుల్లో సంచులు ఉన్నాయి.

ఈ సంచులను స్వాధీనం చేసుకున్న రైల్వే పోలీసులు.. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారా? బంధువులా అనేది విచారణ చేస్తున్నారు. సంచుల్లో టీటీడీ లాకర్ అలాట్మెంట్ టిక్కెట్టు, ఒక ఫోన్ నంబరు ఉండగా.. ఆ ఫోన్ నెంబర్ కి ఫోన్ చేస్తుంటే ఎవరూ తీయడం లేదట. మరో సంచిలో విజయవాడ కార్పొరేషన్ కు చెందిన
వార్డు ఎడ్యుకేషన్ సెక్రటరీ తెన్నేటి సరస్వతీరావు పేరుతో ఓ గుర్తింపు కార్డు లభించగా.. చనిపోయిన ఇద్దరు పురుషుల్లో.. ఒకరు సరస్వతీరావుగా భావిస్తున్నా రు.

టీటీడీ లాకర్ అలాట్మెంట్ పేరుతో దొరికిన స్లిప్పులో బి.రమేష్ నాయక్ అనే పేరు, అతడి ఆధార్ కార్డు నంబరు ఉండడంతో మృతుల్లో రెండో పురుషుడు అతనేనా అనేది విచారిస్తున్నా రు. టీటీడీ టిక్కెట్ నిన్న సాయంత్రం 6.59కి తీసుకున్నట్లు ఉండడం.. రైలు విజయవాడ వైపు వెళుతుండటం.. వారివద్ద ఆధారాల్లో విజయవాడ అని ఉండటంతో.. వీరు తిరుపతి నుండి విజయవాడ వెళ్తూ రైలు నుండి ప్రమాదవశాత్తు కింద పడ్డారా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. అయితే రాత్రి సుమారు 10గంటల సమయంలో రైలు ఢీకొన్నట్లు స్థానికులు చెప్తున్నారు.