Mekapati Chandra Sekhar Reddy: మరో ఎమ్మెల్యే ధిక్కార స్వరం.. నెల్లూరు వైసీపీలో అసలేం జరుగుతుంది?

Kaburulu

Kaburulu Desk

February 1, 2023 | 11:42 PM

Mekapati Chandra Sekhar Reddy: మరో ఎమ్మెల్యే ధిక్కార స్వరం.. నెల్లూరు వైసీపీలో అసలేం జరుగుతుంది?

Mekapati Chandra Sekhar Reddy: నెల్లూరు జిల్లా వైసీపీ నుండి మరో ఎమ్మెల్యే ధిక్కార స్వరం వినిపించడం మొదలు పెట్టారు. ఇప్పటికే ఈ జిల్లా నుండి టాప్ సీనియర్ నేత, ఉమ్మడి రాష్ట్ర మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి, వైసీపీకి సీఎం జగన్ వీరవిధేయుడైన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పార్టీ అధిష్టానంపై ధిక్కార స్వరం తారాస్థాయికి చేరింది. కోటంరెడ్డి అయితే ఏకంగా పార్టీకి గుడ్ బై చెప్పేసి టీడీపీలోకి చేరేందుకు సిద్దమై చంద్రబాబు ఆహ్వానం కోసం ఎదురు చూస్తున్నానని కూడా చెప్పేశారు.

మరోవైపు ఆనం రాంనారాయణ రెడ్డి కూడా రేపో మాపో అన్నట్లు పార్టీకి గుడ్ బై చెప్పేందుకు సిద్ధమయ్యారని తెలుస్తుంది. కాగా ఇప్పుడు మరో ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర రెడ్డి కూడా పార్టీ అధిష్టానంపై ధిక్కార స్వరం మొదలు పెట్టారు. తన నియోజకవర్గంలో పరిశీలకుడు చిచ్చు పెడుతున్నారని ఆరోపిస్తున్న చంద్రశేఖర్ రెడ్డి.. తనను పరిశీలకుడు ధనుంజయరెడ్డి ఇబ్బంది పెడుతున్నారని.. సీఎంకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని చంద్రశేఖర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

పరిశీలకుడు ధనుంజయ రెడ్డి నిర్ణయాలతో తమ పార్టీకి చెడ్డపేరు వస్తుందని.. ఎవరో వచ్చి తన మీద పెత్తనం చేయడానికి కుదరదని చంద్రశేఖర్ రెడ్డి స్పష్టం చేశారు. సీఎం, మంత్రి దగ్గర తేల్చుకోవడానికి మాత్రమే కాదు.. దేనికైనా సిద్ధమేనని ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ప్రకటించారు. ఒకవైపు కోటం రెడ్డి, ఆనం రాంనారాయణరెడ్డి అసంతృప్తితో చిర్రెత్తిపోయిన అధిష్టానానికి చంద్రశేఖర్ రెడ్డి స్వరం పుండు మీద కారంలా మారిపోయింది.

ఇప్పటికే నెల్లూరు జిల్లాలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో.. మాజీమంత్రి, నెల్లూరు, ప్రకాశం జిల్లాల సమన్వయకర్తగా ఉన్న బాలినేని శ్రీనివాస్ రెడ్డి ముఖ్యమంత్రి జగన్‌తో భేటీ అయ్యారు. ఆ భేటీ అలా ఉండగానే చంద్రశేఖర రెడ్డి వ్యాఖ్యలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. ఒకే జిల్లాలో కీలక నేతలుగా.. సీఎం సొంత సామాజికవర్గానికి చెందిన నేతలు ఇలా ధిక్కార స్వరం వినిపించడంతో ఇప్పుడు అసలు పార్టీలో ఏం జరుగుతుందన్నది ఆసక్తిగా మారింది.