TDP: లోకేష్ యువగళం పాదయాత్ర.. ఇంకా అనుమతి ఇవ్వని పోలీసులు.. ఏమవుతుందోనని టెన్షన్!

Kaburulu

Kaburulu Desk

January 22, 2023 | 09:03 AM

TDP: లోకేష్ యువగళం పాదయాత్ర.. ఇంకా అనుమతి ఇవ్వని పోలీసులు.. ఏమవుతుందోనని టెన్షన్!

TDP: తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రకు సర్వం సిద్ధమైంది.. ‘యువగళం’ పేరుతో ఈ యాత్ర నిర్వహించనున్నారు. ఈ యాత్రని టీడీపీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసులోగా.. దీనికి సంబంధించి భారీ యాక్షన్ ప్లాన్.. రూట్ మ్యాప్ కూడా రెడీ చేశారు. అయితే ఈ పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని కోరుతూ టీడీపీ జనవరి 12న డీజీపీతో పాటు మిగతా ఉన్నతాధికారులకు లేఖలు రాశారు.

డీజీపీ, హోంసెక్రటరీ, చిత్తూరు ఎస్పీ, పలమనేరు, పూతలపట్టు డీఎస్పీలకు కూడా సంక్రాంతి పండుగకు ముందే టీడీపీ లేఖలు రాసింది. లోకేశ్ పాదయాత్రకు అనుమతి కోరుతూ ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో వర్ల రామయ్య ఈ
నెల 9నే డీజీపీకి, రాష్ట్ర హోం శాఖ కార్యదర్శి కి లేఖలు రాశారు. 9న ఇ-మెయిల్లో ఆ లేఖలు పంపారు. 10న డీజీపీ, 11న హోం శాఖ కార్యదర్శి కార్యాలయాల్లో హార్డ్ కాపీలు అందజేశారు. ఈ నెల 10న, మళ్లీ 18న పలమనేరు డీఎస్పీ, కుప్పం, పూతలపట్టు, చిత్తూరు డీఎస్పీలకూ లేఖలు రాశారు.

అయితే.. పది రోజులు గడిచినా పోలీసుల నుండి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఈ శుక్రవారం మళ్ళీ లేఖలు రాశారు. దీనికి స్పందించిన పోలీసులు ఆదివారం ఉదయం లోగా తమకి కొన్ని వివరాలు చెప్పాలని శనివారం లేఖ రాశారు. పాదయాత్రలో ఎంతమంది పాల్గొంటారు? వారి వివరాలేంటి? రాత్రుళ్లు ఎక్కడ బస చేస్తారు? ఇలా డీజీపీ అనేక ప్రశ్నలు అడిగారని.. ఆ వివరాలన్నీ ఆదివారం ఉదయం 11 గంటలకల్లా తమకు అందజేయాలని చెప్పారని టీడీపీ నేతలు చెప్తున్నారు.

అయితే ఏదో ఒక సాకుతో లోకేశ్ పాదయాత్రకు అనుమతి నిరాకరించాలన్నదే
పోలీసుల వ్యూహంగా కనిపిస్తోందని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. లోకేశ్ 125 శాసనసభ నియోజకవర్గాల మీదుగా.. 400 రోజులపాటు, 4 వేల కి.మీ.ల సుదీర్ఘ పాదయాత్ర తలపెట్టారు. ఆయన టీడీపీ ప్రధాన కార్యదర్శి , మాజీ మంత్రి, ఆ స్థాయి నాయకుడు పాదయాత్రచేస్తుంటే.. టీడీపీ నాయకులు, పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులు, ప్రజలు
పెద్ద సంఖ్యలో తరలి వస్తారు.

లోకేశ్ అనే కాదు.. ఏ పార్టీ ముఖ్య నాయకులు పాదయాత్ర చేసినా అదే స్థాయిలో హడావుడి ఉంటుంది. అయితే, పోలీసులు పాదయాత్రలో పాల్గొనేవారు, సంఘీభావం చెప్పేవారి వివరాలు కావాలంటే ఎలా ఇవ్వాలని.. పాదయాత్ర వెళ్లేప్పుడు ఎక్కడికక్కడ వాళ్ళు మారుతూ ఉంటారని.. ఆయా గ్రామాలు, నియోజకవర్గాలలో వాళ్ళు మారుతూ ఉంటారు కనుక వాళ్ళ వివరాలు ఎలా ఇవ్వగలమని అడుగుతున్నారు. ఇది పాదయాత్రకు వెళ్లకుండా ముందరి కాళ్లకు బంధం వేయడమేనని విమర్శిస్తున్నారు. సమయం దగ్గర పడుతున్నా ఇంకా పోలీసుల అనుమతులు ఇవ్వకపోవడంతో ఈ పాదయాత్ర ఎలా సాగనుందన్నది ఆసక్తిగా మారింది.