Viral News: నెల్లూరోళ్ళం.. మేమేమన్నా తక్కువ చేస్తామా.. అల్లుడికి 108 రకాల వంటలతో విందు

Kaburulu

Kaburulu Desk

February 2, 2023 | 04:35 PM

Viral News: నెల్లూరోళ్ళం.. మేమేమన్నా తక్కువ చేస్తామా.. అల్లుడికి 108 రకాల వంటలతో విందు

Viral News: ఇంటి కొత్త అల్లుడికి రకరకాల వంటకాలతో విందు భోజనం పెట్టడం తెలుగు ఇళ్లలో ఓ సంప్రదాయం. అయితే.. ఈ మధ్య కాలంలో వందల రకాల వంటలతో కూడా అల్లుళ్ళకి భోజనం పెట్టి రికార్డులు క్రియేట్ చేస్తున్నారు. అయితే.. ఇలాంటివి ఎక్కువగా గోదావరి జిల్లాలలోనే చూస్తుంటాం. గత నెల సంక్రాంతి సమయంలో కూడా పశ్చిమగోదావరి జిల్లా భీమవారానికి చెందిన వ్యాపారవేత్త తటవర్తి బద్రి, సంధ్య దంపతుల కుమార్తె హారికకు అల్లుడు పృథ్వీ గుప్తాకు ఏకంగా 173 రకాల వంటకాలు వడ్డించారు.

అయితే, నెల్లూరోళ్ళం.. మేమేమన్నా తక్కువా చేస్తామా అని.. నెల్లూరు జిల్లాకు చెందిన ఊసా శివకుమార్‌, శ్రీదేవమ్మ దంపతులు కూడా అల్లుడు, కూతురుకి 108 రకాల వంటకాలతో విందు ఏర్పాటు చేసి వహవా అనిపించారు. నెల్లూరుజిల్లా పొదలకూరు మండలం ఊచపల్లికి చెందిన శివకుమార్ కండలేరు పోలీసుస్టేషన్లో హోంగార్డుగా పనిచేస్తున్నారు. తమ కుమార్తె శ్రీవాణిని నెల్లూరులోని బీవీనగర్‌ చెందిన ఇమ్మడిశెట్టి శివకుమార్‌కు ఇచ్చి ఇటీవల ఘనంగా వివాహం చేశారు.

కాగా, తొలిసారిగా ఇంటికి వచ్చిన అల్లుడికి శివకుమార్, శ్రీదేవమ్మ దంపతులు ఘుమఘుమలాడే 108 రకాల వంటలు తయారు చేయించి వడ్డించారు. ఈ మెనూలో మటన్‌, చికెన్, చేప, రొయ్యలు, రసం, సాంబారు, పెరుగుతో పాటూ రకాల పిండివంటలు, స్వీట్లు ఉన్నాయి. ఓ టేబుల్‌పై ఈ వంటకాలను ఉంచి అల్లుడికి వడ్డించారు. విందు ఆరగింపు సమయంలో వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్టు చేయడంతో వీడియో వైరల్ అయ్యింది.

అత్తింటివారు ఏకంగా 108 రకాల వంటలతో అల్లుడికి విందు ఏర్పాటు చేయడంపై ఆ చుట్టుపక్కల గ్రామాల్లో జనాలు చర్చించుకున్నారు. అంతేకాదండోయ్ మామ పేరు శివకుమార్.. అలాగే అల్లుడి పేరు కూడా శివకుమార్ కావడం విశేషం కాగా.. దీనిపై కూడా సోషల్ మీడియాలో విపరీతంగా కామెంట్స్ వస్తున్నాయి. ఏదేమైనా నువ్వు లక్కీ బాస్ అంటూ ఆ కొత్త అల్లుడికి నెటిజన్లు కంగ్రాట్స్ చెప్పేస్తున్నారు.