Kotamreddy Sridhar Reddy: కోటం రెడ్డి ఔట్.. ఇంచార్జిగా ఆదాల ప్రభాకర్ రెడ్డి!

Kaburulu

Kaburulu Desk

February 2, 2023 | 05:05 PM

Kotamreddy Sridhar Reddy: కోటం రెడ్డి ఔట్.. ఇంచార్జిగా ఆదాల ప్రభాకర్ రెడ్డి!

Kotamreddy Sridhar Reddy: నెల్లూరు జిల్లా వైసీపీ రాజకీయం మొత్తం రాష్ట్రానికే సెగలు పుట్టిస్తుంది. ఎమ్మెల్యేలు అసంతృప్తితో పార్టీ అధిష్టానంపైనా.. సీఎం జగన్మోహన్ రెడ్డిపైనా ఆరోపణలు గుప్పిస్తూ రెచ్చిపోతుంటే.. పార్టీ నేతలు కౌంటర్లు వదులుతున్నారు. శృతి మించిన వాళ్ళని పక్కకి నెట్టేసి కొత్త వాళ్ళకి అక్కడ బాధ్యతలు అప్పగిస్తున్నారు. గత కొన్నాళ్ళుగా నెల్లూరు జిల్లాలో ఎమ్మెల్యేలు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రాంనారాయణ రెడ్డి జగన్ ప్రభుత్వం టార్గెట్ గా విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే.

ఆ మధ్య ఆనం రాంనారాయణ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేయగా.. ఆయన్ను నియోజకవర్గం పార్టీ బాధ్యతల నుండి తప్పించి వెంకటగిరి ఇంచార్జిగా ఆయన స్థానంలో మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్థన్ రెడ్డి కుమారుడు రామ్ కుమార్ రెడ్డిని ప్రకటించారు. మరోవైపు గత వారం పదిరోజులుగా మరో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. వైసీపీ పెద్దలు తన ఫోన్ ట్యాప్ చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు.

కాగా, ఇప్పుడూ కోటం రెడ్డిపై కూడా వేటు పడింది. కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి స్థానంలో పార్టీ నియోజకవర్గ ఇంచార్జిగా ఆదాల ప్రభాకర్ రెడ్డిని నియమించారు. వచ్చే ఎన్నికలలో వైసీపీ తరపున ఆదాల ప్రభాకర్ రెడ్డి పోటీ చేస్తారని.. పార్టీ కీలక నేత, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. ఆదాల ప్రస్తుతం నెల్లూరు ఎంపీగా కొనసాగుతుండగా వచ్చే ఎన్నికలలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే ఇప్పుడే టికెట్ ఖరారు చేసుకున్నారు.

కాగా, కోటంరెడ్డి ఇప్పటికే అవకాశమిస్తే టీడీపీ నుండి వచ్చే ఎన్నికలలో పోటీ చేస్తానని ప్రకటించగా.. ఒకవేళ తన తమ్ముడు గిరిధర్ రెడ్డిని వైసీపీ నిలబెడితే రాజకీయాల నుండి దూరమవుతారని చెప్పారు. కానీ, వైసీపీ ఇక్కడ ఆదాలను దించేసింది. దీంతో కోటంరెడ్డికి ఇక్కడ పోటీ చేసేందుకు లైన్ క్లియర్ అయింది. కానీ.. టీడీపీ అధినేత చంద్రబాబు ఎలా రియట్ అవుతారన్నది చూడాల్సి ఉంది.