Tirumala: లడ్డూల తయారీ కోసం రూ.50 కోట్లతో హైటెక్ యంత్రాలు!

Kaburulu

Kaburulu Desk

February 3, 2023 | 06:12 PM

Tirumala: లడ్డూల తయారీ కోసం రూ.50 కోట్లతో హైటెక్ యంత్రాలు!

Tirumala: కలియుగ దైవం శ్రీవారి లడ్డూ ప్రసాదానికి ఎంత ప్రత్యేకత ఉందో తెలిసిందే. దేశవ్యాప్తంగా ఎంతో గుర్తింపు ఉన్న ఈ లడ్డూలోనే భక్తి భావం తీణికిసలాడుతుంది. దేశంలో ఎన్నో ఆలయాలున్నా.. తిరుమల లడ్డూ ప్రసాదాన్ని భక్తులు అత్యంత ప్రీతిపాత్రంగా భావిస్తారు. ఇంతటి విశిష్టమైన లడ్డూ తయారీకి టీటీడీ సిబ్బంది కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. తిరుమలలో లడ్డూ విక్రయ కేంద్రం ద్వారా నిత్యం లక్షలలో లడ్డూలు వితరణ అవుతుంటాయి.

బ్రహ్మోత్సవాలు, వేసవి సెలవులు, ప్రత్యేకమైన, విశిష్టమైన రోజులలో భారీగా లడ్డూలు సరఫరా చేయాల్సి ఉంటుంది. అయితే, ఎంత పెద్ద సంఖ్యలో అందించినా లడ్డూలను నాణ్యతలో ఎలాంటి రాజీ లేకుండా అందిస్తారు. కాగా, ఇప్పుడు లడ్డూల తయారీలో భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు టీటీడీ అధికారులు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తిరుమలలో లడ్డూ తయారీ కోసం వచ్చే డిసెంబర్ నాటికి హైటెక్ యంత్రాలను తీసుకురావాలని నిర్ణయించారు.

తిరుమల అన్నమయ్య భవనంలో శుక్రవారం డయల్ యువర్ ఈవో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా భక్తులనుద్దేశించి మాట్లాడిన ఆయన.. తిరుమలకు సంబంధించి పలు కీలక వివరాలను మీడియాకు వెల్లడించారు. రూ.50 కోట్లతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో గతంలో కంటే మరింత వేగంగా లడ్డూ తయారీ యంత్రాలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు.

అలాగే.. ప్రపంచంలోనే నెంబర్ 1 స్థానంలో నిలిచేలా తిరుమల మ్యూజియంను ఏర్పాటు చేస్తామని చెప్పారు. శ్రీవారి సన్నిధిలోని ఆనంద నిలయం బంగారు తాపడం పనులు 6 నెలల పాటు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. నిర్ధేశించిన సమయంలో బంగారు తాపడం పనులను పూర్తి చేసేందుకు వీలుగా గ్లోబల్‌ టెండర్లకు వెళుతున్నామని.. ఈ ప్రక్రియకు సమయం పడుతుండడంతో పనులను వాయిదా వేశామన్నారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా శ్రీవారి ఆలయంలో తాపడం పనులు పూర్తి చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని ఈవో ధర్మారెడ్డి వివరించారు.