Taraka Ratna: తారకరత్న విదేశాలకి తరలింపు.. ఇంతకీ హెల్త్ స్టేటస్ ఏంటి?

Taraka Ratna: సినీ నటుడు నందమూరి తారక రత్న గుండె పోటుకి గురైన సంగతి తెలిసిందే. నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రలో గుండెపోటుకు గురైన నందమూరి తారకరత్నకు మొదట కుప్పంలో అందించారు.. ఆ తర్వాత బెంగళూరు నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. తీవ్ర గుండె పోటు నేపథ్యంలో మెదడు పనితీరుపై తీవ్ర ప్రభావం చూపించింది.
అయితే, ప్రస్తుతం గుండె సహా ఇతర ప్రధాన అవయవాలన్నీ ప్రస్తుతం సరిగ్గానే పనిచేస్తున్నట్లు నందమూరి కుటుంబ సభ్యులతో పాటు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా చెప్పిన సంగతి తెలిసిందే. తారకరత్న ఆరోగ్యంపై పలు రకాలుగా వార్తలు వినిపించినా అవన్నీ అబద్ధాలేనని.. ప్రస్తుతం ఆయనకి ఐసీయూలో చికిత్స అందుతుందని, డాక్టర్ల చికిత్సకి ఆయన స్పందిస్తున్నారని కూడా చెప్పుకొచ్చారు. ఎప్పటికప్పుడు తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై బెంగళూరు నారాయణ హృదయాలయ ఆసుపత్రి మెడికల్ సిబ్బంది బులెటిన్ విడుదల చేస్తూ ప్రజలకి కూడా వివరించారు.
దీంతో అందరూ తారకరత్న కోలుకుంటారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. తారకరత్న ఆరోగ్యవంతుడై తిరిగి రావాలంటూ హిందూపురం టీడీపీ నేతలు 101 కొబ్బరికాయలు కొట్టారు. హిందూపురం టీడీపీ పార్లమెంటు స్థానం ప్రధాన కార్యదర్శి, తారక రత్న కుటుంబ సన్నిహితుడైన అంబికా లక్ష్మీనారాయణ, ఇతర నేతలు ఈ పూజల్లో పాల్గొన్నారు. కాగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తారకరత్నను దగ్గరుండి చూసుకుంటున్నారు బాలయ్య.
కాగా.. తాజా సమాచారం ఏంటంటే.. తారక రత్నను మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం విదేశాలకు తరలించేందుకు కుటుంబ సభ్యులు యోచిస్తున్నారట. ఈ విషయాన్ని అంబికా లక్ష్మినారాయణ వెల్లడించారు. మెదడుపై ప్రభావం పడడంతో సంబంధిత వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆయా వైద్య పరీక్షల ఫలితాల అనంతరం, విదేశాలకు తారకరత్న తరలింపుపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈరోజు తారకరత్న మెదడుకు సంబంధించిన స్కాన్ తీశారు. అందులో వచ్చే రిపోర్టులను బట్టి మెదడు పరిస్దితి అర్థం అవుతుందని చెప్తున్నారు.