Assembly Sessions: కేటీఆర్, ఈటల, భట్టి, రాజాసింగ్ సరదా సంభాషణ.. అసెంబ్లీలో నవ్వుల్ పువ్వుల్!

Kaburulu

Kaburulu Desk

February 3, 2023 | 04:04 PM

Assembly Sessions: కేటీఆర్, ఈటల, భట్టి, రాజాసింగ్ సరదా సంభాషణ.. అసెంబ్లీలో నవ్వుల్ పువ్వుల్!

Assembly Sessions: తెలంగాణలో రాజకీయాలు ఏ రేంజిలో ఉన్నాయో అందరికీ తెలిసిందే. పట్టుమని పది నెలలు కూడా ఎన్నికలకు సమయం లేకపోవడంతో ఏ పార్టీకి ఆ పార్టీ అధికారమే టార్గెట్ గా రెచ్చిపోతున్నారు. ఇప్పటికే విపక్షాల మధ్య మాటల యుద్ధం ఓ స్థాయి దాటి తారాస్థాయికి చేరుకుంటున్నాయి. ఇలాంటి సమయంలో అసెంబ్లీ సమావేశాలు రావడం.. అది కూడా బడ్జెట్ సమావేశాలు కావడంతో కొంత ఆసక్తి నెలకొంది. అధికార, ప్రతిపక్షాల మధ్య వాదనలతో అసెంబ్లీ దద్దరిల్లడం ఖాయమని అంచనా వేస్తున్నారు.

అయితే, తొలిరోజు గవర్నర్ ప్రసంగం మినహా సమావేశాలు లేకపోగా రేపటి నుండి ఎలా ఉంటుందో చూడాలి. అయితే.. తొలిరోజు సభలో నవ్వుల్ పువ్వుల్ పూశాయి. అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు ఒక్కచోట చేరి ఒకరిపై ఒకరు కౌంటర్లు వేసుకొని సరదాగా నవ్వుకున్నారు. బీజేపీ ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రఘునందన్ రావు, రాజాసింగ్ ఒక్కచోట ఉండగా అక్కడకి ప్రత్యేకంగా మంత్రి కేటీఆర్ వచ్చి మాట్లాడారు. ఈ సందర్భంగా పలు అంశాలపై వారి మధ్య సంభాషణ జరిగినట్లు తెలిసింది.

హుజూరాబాద్ లో జరిగిన అధికారిక కార్యక్రమంలో ఎందుకు పాల్గొనలేదని మంత్రి కేటీఆర్.. ఈటలను ప్రశ్నించగా.. పిలిస్తే కదా హాజరయ్యేది అంటూ ఆయన సమాధానమిచ్చినట్లు సమాచారం. అంతేకాదు, ప్రభుత్వ విధానాలు ప్రజల్లోకి వెళ్లే ప్రాక్టీస్ సరిగా లేదని ఈటల కేటీఆర్ కు హితవు పలికినట్లు తెలిసింది. కేటీఆర్, ఈటల మధ్య సంభాషణ జరుగుతుండగానే సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అక్కడికి వెళ్లగా.. తనను సైతం అధికారిక కార్యక్రమాలకు పిలవడం లేదని ఆయన ప్రస్తావించారు. మళ్లీ ఈటల కలుగజేసుకుని కనీసం కలెక్టర్ నుంచైనా ఆహ్వానం ఉండాలి కదా అనడంతో కేటీఆర్ నవ్వి ఊరుకున్నారట.

మరోవైపు రాజాసింగ్, కేటీఆర్ మధ్య కూడా సరదా సంభాషణ జరిగింది. కాషాయ రంగు చొక్కా వేసుకొచ్చిన రాజాసింగ్ ను ఉద్దేశించి కేటీఆర్.. చొక్కారంగు కళ్లకు గుచ్చుకుంటుందని.. ఆ రంగు తనకి ఇష్టం ఉండదని అన్నారట. దీంతో రాజాసింగ్ భవిష్యత్ లో మీరూ కాషాయ రంగు చొక్కా వేసుకోవచ్చేమోనని సరదాగా అన్నారట. అంతలో గవర్నర్ సభకు వస్తున్నారని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అలెర్ట్ చేయగా.. కేటీఆర్ ట్రెజరీ బెంచీల వైపు వెళ్లిపోయారట.