YSRCP: ప్రభుత్వంపై విమర్శల ఎఫెక్ట్.. ఆనంపై చర్యలు షురూ!

Kaburulu

Kaburulu Desk

January 3, 2023 | 09:01 PM

YSRCP: ప్రభుత్వంపై విమర్శల ఎఫెక్ట్.. ఆనంపై చర్యలు షురూ!

YSRCP: ఉమ్మడి రాష్ట్ర మాజీ మంత్రి, నెల్లూరు కీలక సీనియర్ నేత, వైసీపీ ఎమ్మెల్యే ఆనం రాంనారాయణ రెడ్డిపై వైసీపీ అధిష్టానం వేటు వేసింది. ఆయనను వెంకటగిరి నియోజకవర్గ వైకాపా ఇంచార్జి బాధ్యతల నుంచి తొలగించి వెంకటగిరి ఇంచార్జిగా ఆయన స్థానంలో మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్థన్ రెడ్డి కుమారుడు రామ్ కుమార్ రెడ్డిని ప్రకటించారు. ఇది కేవలం ఇంచార్జి బాధ్యతల నుండి తొలగించడం మాత్రమే కాదు ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఆనం ఛరిస్మాను తగ్గించేందుకే అధిష్టానం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా కనిపిస్తుంది.

ఆనం రాంనారాయణ రెడ్డి కొద్ది రోజులుగా వైసీపీ అధిష్టానంపై కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. బహిరంగ సభలపైనే సీఎం జగన్ మోహన్ రెడ్డితో పాటు వైసీపీ పార్టీపై విమర్శలు చేస్తూ కౌంటర్లు వేస్తున్నారు. ఈరోజు కూడా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు అంటున్నారు.. అవే వస్తే తామంతా ముందే ఇంటికి వెళ్లడం ఖాయమని వ్యాఖ్యానించారు. అంతేకాదు సైదాపురం మండలంలో సచివాలయాల నిర్మాణాలు సరిగా జరగడం లేదని మండిపడిన ఆనం.. ‘ప్రజలు అధికారం ఇచ్చి నాలుగేళ్లు అవుతోంది. ఇంకా సచివాలయ నిర్మాణాలు పూర్తి కాలేదు. ఇందుకు సాంకేతిక కారణాలా? బిల్లుల చెల్లింపు జాప్యమా? తెలియడం లేదు’ అంటూ అసంతృప్తి వెళ్లగక్కారు.

ఈరోజు మాత్రమే కాదు గత రెండు మూడు రోజులుగా ఆనం ఎక్కడకి వెళ్లినా ఇలాంటి వ్యాఖ్యలే చేస్తున్నారు. అయితే.. అప్పటి నుండి వేచి చూసిన పార్టీ పెద్దలు ఇక లాభం లేదని తాజాగా సీఎం జగన్ కు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఆనంపై ఆగ్రహంగా ఉన్న సీఎం జగన్ ఆనంపై చర్యలు తీసుకోవాలని పార్టీ ముఖ్య నేతలకు ఆదేశాలు జారీ
చేసినట్టు తెలిసింది. అనుకున్నదే తడవుగా ఇంచార్జి మార్పుపై పార్టీ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.

అయితే.. దీనిపై ఆనం మరోలా స్పందించారు. ఇంచార్జి మార్పు వార్తలపై నాకు సమాచారం లేదు. ఊహాగానాలపై స్పందించను.. ఆదేశాలు వచ్చాక స్పందిస్తా.. మంత్రులు నాపై చేసిన వ్యాఖ్యలు విన్నాకే స్పందిస్తానని చెప్పారు. ప్రభుత్వ పనులు ఆలస్యం అవుతున్నాయన్నదే నా ఆవేదన. ముందస్తు ఎన్నికలు వస్తే బిల్లుల చెల్లింపులో ఇబ్బందులు వస్తాయనే చెప్పానని ఆనం మీడియాకు వివరణ ఇచ్చారు. ఆనం వ్యాఖ్యల కట్టడి కోసమే అధిష్టానం ఇంచార్జి బాధ్యతల నుండి తప్పించినట్లు అర్ధమవుతుంది. మరి ఆదేశాలు వచ్చిన తర్వాత ఆనం స్పందన ఎలా ఉండబోతుంది? ఎలాంటి బాంబ్ పేల్చనున్నారన్నది ఇప్పుడు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది.