CM Jagan: చంద్రబాబుపై జగన్ విమర్శలు.. ‘జడ్జి-నేరస్తుడి’ కథతో కౌంటర్లు

Kaburulu

Kaburulu Desk

January 3, 2023 | 05:06 PM

CM Jagan: చంద్రబాబుపై జగన్ విమర్శలు.. ‘జడ్జి-నేరస్తుడి’ కథతో కౌంటర్లు

CM Jagan: ఏపీలో ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉండగా.. రాజకీయ పార్టీలలో ఆ సందడి మాత్రం మొదలైంది. ప్రతిపక్ష నేతలు ఏదో ఒక పేరు పెట్టుకొని ప్రజల మధ్యకి వెళ్తుంటే.. అధికారంలో ఉన్న పార్టీ నేతలు ఏదో ఒక కార్యక్రమం పేరుతో ప్రజల వద్దకు వెళ్తున్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి కూడా ఈ మధ్య కాలంలో పలు కార్యక్రమాల జోరు పెంచినట్లుగా కనిపిస్తుంది. కొత్త సంవత్సరంలో వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు ఇచ్చే పెన్షన్ మరో రూ.250 పెంచి మొత్తం రూ.2750 చేశారు. దీనిపై ప్రభుత్వం రాజమండ్రిలో పెన్షన్ లబ్దిదారుల ముఖాముఖి కార్యక్రమం ఏర్పాటు చేసింది.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం జగన్ టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సీఎం ప్రతిసభలో ప్రతిపక్షాలపై విమర్శలు చేయడం సహజమే కాగా.. ఈ మధ్య కాలంలో ఈ విమర్శలు కాస్త భిన్నంగా కనిపిస్తున్నాయి. కిందటి సభలో కూడా జనసేనాని పవన్ పెళ్లిళ్ల గురించి ఉద్దేశించి కౌంటర్లు వేసిన జగన్ ఈసారి చంద్రబాబును ఉద్దేశించి సామెత ఒకటి చెప్తూ కౌంటర్లు వేశారు. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో ఫొటోషూట్, డ్రోన్ షాట్ల కోసం రాజమండ్రి పుష్కరాల్లో 29 మందిని బలి తీసుకున్నారని ఆరోపించిన జగన్.. కందుకూరులో జనం ఎక్కువగా వచ్చినట్టు చూపించేందుకు ఒక ఇరుకు సందులోకి నెట్టి సభ నిర్వహించాడని మండిపడ్డారు.

గుంటూరులో తాను వచ్చేదాకా చీరలు పంచవద్దని చెప్పి, మహిళల ప్రాణాలు పోవడానికి కారకుడయ్యాడని ఆరోపించారు. కందుకూరులో 8 మందిని బలి తీసుకొని మౌనం పాటించాలని అంటాడని.. గుంటూరులో ముగ్గురిని చంపి మానవతావాదిలా నాటకాలు ఆడతాడని సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచి చంపి, మళ్లీ మొసలి కన్నీరు కారుస్తాడని అన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ జడ్జి-నేరస్తుడి కథ ఒకటి చెప్పారు. ‘ఓ వ్యక్తి కోర్టులో న్యాయమూర్తి ఎదుటకు వచ్చి.. అయ్యా నాకు తల్లిదండ్రులు లేరు.. నాపై దయచూపి నన్ను శిక్షించవద్దు అని కోరతాడు.

దాంతో ఆ జడ్జి ఆ వ్యక్తి ఏం నేరం చేసి కోర్టుకు వచ్చాడని ప్రాసిక్యూటర్ ను అడుగుతారు. అప్పుడా ప్రాసిక్యూటర్… నిజమే యువరానర్.. ఆ వ్యక్తికి తల్లిదండ్రులు లేరు. ఎందుకంటే, ఆ తల్లిదండ్రులను అతడే చంపాడు కాబట్టి అని వివరిస్తాడు. చంద్రబాబును చూస్తే ఇలాగే అనిపిస్తుంది’ అంటూ సెటైర్లు వేశారు. పేదవాళ్లను చంపేసి పార్టీ కోసం ప్రాణత్యాగాలు చేశారంటాడని ధ్వజమెత్తారు. మరి దీనిపై తెలుగు తమ్ముళ్లు ఎలా స్పందిస్తారో చూడాలి.