V. V.Vinayak: దర్శకుడు వినాయక్ పొలిటికల్ కామెంట్స్.. ఆ పార్టీ కోసమేనా?

Kaburulu

Kaburulu Desk

January 15, 2023 | 10:21 PM

V. V.Vinayak: దర్శకుడు వినాయక్ పొలిటికల్ కామెంట్స్.. ఆ పార్టీ కోసమేనా?

V. V. Vinayak: తెలుగు సినీ దర్శకుడు వీవీ వినాయక్ ఓ రాజకీయ కార్యక్రమంలో పాల్గొనడంతో పాటు ఆ వేదికగా చేసిన కామెంట్స్ ఇప్పుడు తెలుగు రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారాయి. వినాయక్ కు అటు తెలుగుదేశం పార్టీతో పాటు వైసీపీలో కీలకంగా ఉన్న కొడాలి నాని, వల్లభనేని వంశీ లాంటి నేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అటు వినాయక్ సొంత ప్రాంతంలో కుటుంబం కూడా వైసీపీకి సన్నిహితంగా ఉంది.

స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మంచి సంబంధాలు ఉన్న వినాయక్ కు అతనితో సినిమాలు నిర్మించిన వంశీ, నానీలతో మంచి అనుబంధం ఏర్పడింది. వినాయక్ సినిమాలలో ఉన్నా ఆ తర్వాత నానీ, వంశీలు రాజకీయాలలో బిజీగా మారిపోయారు. అయితే.. ఇప్పుడు కొడాలి నానీ నిర్వహించిన ఓ వేదికపై హాజరైన దర్శకుడు వినాయక్ చేసిన కామెంట్స్ మళ్ళీ వినాయక్ ను ఫోకస్ లోకి తీసుకొచ్చాయి.

గుడివాడలో సంక్రాంతి పండుగ సందర్భంగా నిర్వహించిన జాతీయస్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బండ లాగుడు పోటీలకి డైరెక్టర్‌ వివి వినాయక్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎండ్ల పందాలను ప్రారంభించి సందడి చేసిన వినాయక్.. కొన్ని పొలిటికల్ కామెంట్స్ కూడా చేశారు. ‘కొడాలి నాని వల్లే తానీ స్థాయిలో ఉన్నా అన్న వినాయక్.. తనకెంతో ఇష్టమైన వ్యక్తి నాని అన్నారు. అక్కడితోనే ఆగలేదు.. కొడాలి ఎప్పుడంటే అప్పుడు సినిమా చేసేందుకు సిద్ధంగా ఉన్నా’ను అన్నారు.

ప్రతీ ఏటా సంక్రాంతికి గుడివాడలో నిర్వహించే కార్యక్రమాలకు ఓ ప్రత్యేకమైన అతిథిని కొడాలి నాని ఆహ్వానిస్తుంటారు. ఇదే విధంగా గత ఏడాది బైరెడ్డి సిద్దార్ధరెడ్డిని ఆహ్వానించగా.. ఇప్పుడు వివి వినాయక్ ను పిలిచారు. అతిథిలా వచ్చిన వినాయక్ కొడాలి నానిని ఆకాశానికి ఎత్తేయడం.. సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పడంతో ఇది రాజకీయాలకు అనుకూలంగా తెరకెక్కే సినిమానే కదా అనే ఊహాగానాలు మొదలయ్యాయి.