Kodali Nani: ఎన్టీఆర్ కాదు.. ప్రభాస్, మహేష్ కలిసి వచ్చినా జగన్ను ఓడించలేరు.. కొడాలి ఆసక్తికర వ్యాఖ్యలు!

Kodali Nani: టీడీపీ నేత నారా లోకేష్ యువగళం పేరిట ప్రస్తుతం తిరుపతి నియోజకవర్గంలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మాట్లాడిన లోకేష్ జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. తిరుపతి పర్యటనలో ఆటో డ్రైవర్లతో జరిగిన ముఖాముఖి సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడిన లోకేష్ కు.. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే మీరు ఆహ్వానిస్తారా? అనే ప్రశ్న ఎదురైంది.
దీనికి లోకేష్ కూడా ఆసక్తికరమైన సమాధానం చెప్పారు. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే మీరు ఆహ్వానిస్తారా? అనే ప్రశ్నకు.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోరుకునే ప్రతి ఒక్కరితో పాటు మంచి మనసు కలిగిన వాళ్లంతా రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు లోకేష్. అయితే, దీనిపై స్పందించిన మాజీ మంత్రి కొడాలి నానీ మాత్రం ఎప్పటిలాగానే టీడీపీ, నారా లోకేష్, చంద్రబాబులపై తీవ్ర విమర్శలకు దిగారు.
ఇంకా చెప్పాలంటే ఎన్టీఆర్ ఒక్కడే కాదు.. మహేష్ బాబు, ప్రభాస్ కలిసి వచ్చినా జగన్ ను ఓడించలేరని ధీమా వ్యక్తం చేశారు. జూనియర్ ఎన్టీఆర్ కు టిడిపి పగ్గాలు అప్పగించి చంద్రబాబు, నారా లోకేష్ పార్టీ నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేసిన కొడాలి నానీ.. ఎన్టీఆర్ ను నారా లోకేష్ పార్టీలోకి ఆహ్వానించడం ఏంటని.. అది ఆయన తాత స్థాపించిన పార్టీ అని గుర్తు చేశారు. మార్పు రావాల్సింది రాష్ట్రంలో కాదని.. తెలుగుదేశం పార్టీలో రావాలని పేర్కొన్నారు.
జగన్మోహన్ రెడ్డిని ఓడించే దమ్ము లేక ఇప్పుడు మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ సపోర్ట్ అడుగుతున్నారని కొడాలి నాని ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ తో కలిసి రాబోతున్న టీడీపీకి ఇప్పుడు ఎన్టీఆర్ అవసరం ఏమొచ్చిందన్న కొడాలి.. అందరూ కలిసి వచ్చినా జగన్ మోహన్ రెడ్డిని ఈసారి ఎవరూ ఓడించలేరని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అయితే, అసలు రాజకీయాలలో లేని మహేష్, ప్రభాస్ పేర్లను కూడా కొడాలి తీసుకురావడం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చకు దారితీస్తుంది.