History of Ramappa Temple: రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు ఎలా వచ్చిందో తెలుసా…?

Kaburulu

Kaburulu Desk

January 15, 2023 | 10:49 PM

History of Ramappa Temple: రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు ఎలా వచ్చిందో తెలుసా…?

తెలంగాణలో అత్యంత ప్రసిద్ధి చెందిన చారిత్రక కట్టడమైన రామప్ప దేవాలయం  2021 జులై 25న ప్రపంచ వారసత్వ సంపదగా ప్రకటించబడింది. కేంద్ర ప్రభుత్వం 2020 సంవత్సరానికి మన దేశం నుండి రామప్ప దేవాలయాన్ని వారసత్వ కట్టడంగా గుర్తించడం కోసం ప్రతిపాదనలు పంపింది. ప్రపంచవ్యాప్తంగా 255 కట్టడాలు యునెస్కో వారసత్వ హోదా గుర్తింపు కోసం పోటీ పడ్డాయి. యునెస్కో రామప్పకు వారసత్వ హోదా ఇవ్వడం ద్వారా ఎనిమిది వందల సంవత్సరాల నాటి రామప్ప దేవాలయానికి తగిన గుర్తింపు లభించింది. మరి ఇంత చరిత్ర కలిగిన రామప్ప దేవాలయ ప్రత్యేకతలు ఏమిటో ఇపుడు తెలుసుకుందాం.

రామప్ప దేవాలయం ఓరుగల్లును పరిపాలించిన కాకతీయ రాజులు నిర్మించిన చారిత్రక దేవాలయం. కాకతీయ వంశీకుల రాజధానియైన వరంగల్లు పట్టణానికి సుమారు 70 కి.మీ.దూరంలో ములుగు జిల్లా, వెంకటాపూర్ మండలంలోని పాలంపేట అనే ఊరి దగ్గర ఉంది. దీనినే రామలింగేశ్వర దేవాలయం అని కూడా వ్యవహరిస్తారు.  ఈ దేవాలయం విశ్వబ్రాహ్మణ శిల్పుల పనితనానికి మచ్చుతునకగా చెప్పవచ్చు. ఈ దేవాలయం పక్కనే రామప్ప సరస్సు ఉంది. ఆ చెరువు కాకతీయుల కాలం నాటిది. ఇది ఇప్పటికి వేల ఎకరాల పంటకు ఆధారంగా ఉంది.

రామప్పగుడి ఆలయ నిర్మాణంలోని చిత్ర కౌశలం, శిల్ప నైపుణ్యం అద్భుతమైనది. ఈ కాకతీయ శిల్పచాతుర్యమంతా, ఇన్నేళ్ళు గడిచినా, ఈ నాటికి చూపరులకు అమితానందాన్ని కలిగిస్తూంది. నాట్య శాస్త్రమంతా మూర్తీ భవించి, స్థంబాలమీదా, కప్పులమీదా, కనబడుతుంది. రామప్ప గుడిలోని విగ్రహాలు, స్థంబాలపై ఉన్న శిల్పాలు ముఖ్యంగా దేవాలయ మంటపంపై కోణాల్లో నాలుగు పక్కలా పెద్ద నల్లారాతి నాట్య కత్తెల విగ్రహాలు అతి సుందరమైనవి. ఆ విగ్రహాల సొమ్ముల అలంకరణాలు, వాటి త్రిభంగీ నాట్య భంగిమలూ శిల్పకారుల్నే సమ్మోహితుల్ని చేస్తున్నాయి. దేవాలయం లోని స్థంబాలపై నాట్య భంగిమలు మృదంగాది వాద్యముల వారి రేఖలు చిత్రించబడి ఉన్నాయి. ఇంత శిల్పకళా సంపద వల్లనే ఈ ఆలయానికి యునెస్కో గుర్తింపు లభించింది. మరి ఇంత ఘన చరిత్ర కలిగిన దేవాలయాన్ని మీరూ ఒకసారి వెళ్ళి దర్శించుకోండి.