Kodali Nani: ఎన్టీఆర్ మృతిపై విచారణ జరపాల్సిందే.. కేసీఆర్, మోడీలకి లేఖ రాస్తానన్న కొడాలి!

Kaburulu

Kaburulu Desk

February 4, 2023 | 09:45 PM

Kodali Nani: ఎన్టీఆర్ మృతిపై విచారణ జరపాల్సిందే.. కేసీఆర్, మోడీలకి లేఖ రాస్తానన్న కొడాలి!

Kodali Nani: మాజీ మంత్రి కొడాలి నానీ మరో కొత్త అంశాన్ని తెరపైకి తెచ్చారు. దివంగత నేత, టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు, ఉమ్మడి రాష్ట్ర మాజీ సీఎం నందమూరి తారకరామారావు మృతిపై తమకి అనుమానాలు ఉన్నాయని.. ఎన్టీఆర్ మృతిపై విచారణ జరపాల్సిందేనని డిమాండ్ చేశారు. అంతేకాదు, ఈ విషయంపై ప్రధాని నరేంద్ర మోడీకి, తెలంగాణ సీఎం కేసీఆర్ కు లేఖలు కూడా రాస్తానని చెప్పుకొచ్చారు.

మాజీ మంత్రి, సీఎం జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఎంపీ అవినాష్ సిబిఐ విచారణ ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. అప్పటి నుండి ప్రతిపక్షాలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నాయి. అయితే, ఇప్పుడు దానికి కౌంటర్ గా వైసీపీ నేతలు మరో సరికొత్త డిమాండ్‌ను తెరపైకి తీసుకొచ్చారు. ఇప్పటి వరకు ఎన్టీఆర్ కు చంద్రబాబు వెన్నుపోటు జరిపించారని విమర్శలు చేసిన వైసీపీ నేతలు ఇప్పుడు ఏకంగా ఆయన మృతిపై అనుమానాలున్నాయంటున్నారు.

తాజాగా ఈ విషయంపై మాట్లాడిన కొడాలి నానీ.. వివేకానంద రెడ్డి హత్య జరిగినప్పుడు సీఎంగా ఉన్న చంద్రబాబు ఎందుకు హంతకులను పట్టుకోలేదని ప్రశ్నించారు. వివేకా హత్య కేసుతో చంద్రబాబు, లోకేష్, అప్పటి డీజీపీ, ఇంటెలిజెన్స్ డీజీ, కడప జిల్లా ఎస్పీతో పాటు టీడీపీ నేతల ఫోన్ కాల్స్ పైనా విచారణ చేయాలని డిమాండ్ చేశారు. వివేకా హత్యకు ముందు ఆ తర్వాత వీళ్లంతా ఏమేం మాట్లాడుకున్నారో కూడా విచారణ చేయాలన్నారు.

ఇక, ఎన్టీఆర్ మరణంపై కూడా తమకి అనుమానాలు ఉన్నాయన్న కొడాలి.. ఎన్టీఆర్‌ వారసులు ఇప్పుడు పార్టీలోకి వస్తే యాక్సిడెంట్లు, గుండెపోట్లు ఎందుకు వస్తున్నాయని ప్రశ్నించారు. ఆరోజుల్లో హరికృష్ణ ఎంత డిమాండ్‌ చేసినా, ఎన్టీఆర్‌ మృతిపై విచారణ జరపలేదని.. అసలెందుకు విచారణ చేయలేదని ప్రశ్నించారు. ఎన్టీఆర్‌
చనిపోతే పోస్ట్‌మార్టం కూడా చేయించలేదని.. ఎన్టీఆర్‌ మరణం వెనుక ఏదో గుట్టు ఉందని, ఆ గుట్టు తేల్చాల్సిందేనన్నారు. ఈ విషయంపై తాను ప్రధాని మోడీకి, తెలంగాణ సీఎం కేసీఆర్ కు లేఖలు రాస్తానని చెప్పారు.