BRS-YSRCP: బీఆర్‌ఎస్‌పై వైసీపీ నేతల ఘాటు వ్యాఖ్యలు.. టార్గెట్ మొదలైనట్లేనా?

Kaburulu

Kaburulu Desk

January 2, 2023 | 08:39 PM

BRS-YSRCP: బీఆర్‌ఎస్‌పై వైసీపీ నేతల ఘాటు వ్యాఖ్యలు.. టార్గెట్ మొదలైనట్లేనా?

BRS-YSRCP: ఏపీలో కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ సన్నాహాలు మొదలు పెట్టనుందని గట్టి ప్రచారం జరుగుతుంది. త్వరలోనే గుంటూరు, లేదా విజయవాడలలో తెలంగాణ సీఎం కేసీఆర్ భారీ బహిరంగ సభ పెట్టనున్నట్లు కూడా గట్టి ప్రచారం జరుగుతుంది. ఏపీలో బీఆర్ఎస్ విస్తరణ మొదలవగానే నలుగురైదుగురు పేరున్న నాయకుల చేరికలు కూడా ఉండనున్నాయని రాజకీయ వర్గాలలో తీవ్ర చర్చలు సాగిపోతున్నాయి. ఏపీలో బీఆర్ఎస్ విస్తరణపై టీడీపీ నుండి ఇప్పటి వరకు ఎలాంటి స్పందనలు లేవు. టీడీపీ నేతలెవరూ కేసీఆర్ పార్టీపై ఎలాంటి కామెంట్స్ చేయడం లేదు.

అయితే.. ఏపీలో అధికార వైసీపీ మాత్రం బీఆర్ఎస్ పై కౌంటర్లు మొదలు పెట్టింది. ఏకంగా మంత్రులు, మాజీ మంత్రులే ఒక్కొక్కరు బీఆర్ఎస్ మీద మాటల దాడి మొదలు పెట్టారు. ఒకరిద్దరు మంత్రులు చురకలంటిస్తుంటే.. మరికొందరు ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఏపీలో బీఆర్ఎస్ పార్టీపై స్పందించిన మంత్రి రోజా.. ఎవరు ఎక్కడైనా పార్టీలు పెట్టుకోవచ్చని అంటూనే.. ముందు తెలంగాణ నుండి ఏపీ రావాల్సిన వాటి సంగతి తేల్చి ఏపీ ప్రజలకు సమాధానం చెప్పాలని వ్యాఖ్యానించారు.

ఇక మాజీ మంత్రి పేర్ని నాని బీఆర్ఎస్ పార్టీపై ఘాటు వ్యాఖ్యలే చేశారు. తెలంగాణ మంత్రులు సిగ్గులేకుండా మాట్లాడుతున్నారన్న పేర్ని నానీ.. తెలంగాణ మంత్రులు భయంతో ఉన్నారన్నారు. ఏపీకి ద్రోహం చేసింది తెలంగాణ నేతలే అని ఆరోపించిన ఆయన ఏపీలో కేసీఆర్ ఏం చేస్తారని ప్రశ్నించారు. ఏపీకి వెన్నుపోటు పొడిచిన తెలంగాణ నేతలు.. ఏపీని ఏం ఉద్ధరిస్తారని ప్రశ్నించారు. ఏపీకి చెందిన తమ ఆస్తులు పంచారా? డబ్బులు ఇచ్చారా? అని ప్రశ్నించిన నానీ ముందు విద్యుత్ బకాయిలు చెల్లించి మాట్లాడండి అని అన్నారు.

కేఏ పాల్ కూడా 175 స్థానాల్లో పోటీ చేశారని.. బీఆర్ఎస్ పోటీ చేస్తే తప్పులేదని పేర్ని నానీ ఎద్దేవా చేశారు. ఇక మరో మాజీ మంత్రి కొడాలి నానీ కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. చేసుకుంటే చేసుకోనివ్వండి.. బీఆర్ఎస్ ప్రభావం ఏపీలో ఉండదని కొడాలి నాని అన్నారు. మొత్తంగా ఏపీలో బీఆర్ఎస్ విస్తరణపై టీడీపీ సైలెంట్ మోడ్ లో ఉన్నా.. వైసీపీ నేతలు కౌంటర్లు మొదలు పెట్టడం ఆసక్తిగా మారింది. తోట చంద్రశేఖర్, రావెల కిషోర్ బాబు లాంటి జనసేనతో సంబంధాలున్న నేతలు బీఆర్ఎస్ లో చేరనున్నారని ప్రచారం జరుగుతున్నా ఆ పార్టీ నేతలు సైలెంట్ గానే ఉన్నారు. కానీ.. వైసీపీ మాత్రం చెలరేగిపోతుంది. మరి ముందు ముందు ఈ కౌంటర్లు.. వ్యాఖ్యలు ఇంకెంత దుమారం రేపుతాయో చూడాల్సి ఉంది.