Mount Abu: ఇళ్లలో నీరు కూడా గడ్డకట్టేలా మైనస్ 7 డిగ్రీల చలి.. మనదేశంలోనే!

Kaburulu

Kaburulu Desk

January 15, 2023 | 06:24 PM

Mount Abu: ఇళ్లలో నీరు కూడా గడ్డకట్టేలా మైనస్ 7 డిగ్రీల చలి.. మనదేశంలోనే!

Mount Abu: రాజస్థాన్‌ రాష్ట్రం మొత్తం చలితో వణికిపోతోంది. విపరీతమైన చల్లగాలులు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. రోజు రోజుకు ఈ రాష్ట్రంలో మైనస్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎప్పుడూ లేని విధంగా రికార్డు స్థాయిలో మైనస్ డిగ్రీలకు పడిపోతోంది. దీంతో రాష్ట్ర ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వృద్ధులు, చిన్నారులు అనారోగ్యాలకు గురువుతున్నారు.

ఆదివారం ఉదయం రాజస్థాన్ లోని ఫతేపూర్‌లో – 4.7 డిగ్రీల సెల్సియస్‌, అదే రాష్ట్రంలోని చురు ప్రాంతంలో – 2.7 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. పశ్చిమ రాజస్థాన్‌లోని అనేక చోట్ల నేలపై మంచు పేరుకుపోయింది. దీని వల్ల అజ్మీర్, కోటా, ఉదయ్‌పూర్ డివిజన్‌లలో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయానని వాతావరణ శాఖ ప్రతినిధి తెలిపారు.

మంచు వర్షం కారణంగా రాజస్థాన్​లో ఉష్ణోగ్రతలు ఈ స్థాయిలో పడిపోతున్నాయి. 28 సంవత్సరాల తర్వాత మౌంట్​ అబూ ప్రాంతంలో ఉష్ణోగ్రత మైనస్​ 7 డిగ్రీల సెల్సియస్​గా నమోదైంది. శనివారం ఉష్ణోగ్రత మైనస్ 4 డిగ్రీల సెల్సియస్​గా నమోదవ్వగా.. ఆదివారం కనిష్ఠ ఉష్ణోగ్రత మైనస్ 7 డిగ్రీల సెల్సియస్​గా నమోదైంది.​ దీంతో మౌంట్ అబూలో జనజీవనం స్తంభించిపోయింది. 1994 తర్వాత ఈ తరహాలో ఉష్ణోగ్రతలు పడిపోవడం ఇదే మొదటిసారి అని స్థానికులు అంటున్నారు.

మైనస్ 7 డిగ్రీల సెల్సియస్ నమోదవడంతో ఇళ్లలో ఉంచిన నీరు కూడా గడ్డ కట్టి ఐస్ లాగా మారిపోయింది. ఖాళీ ప్రదేశాలపై పడిన మంచు కూడా గడ్డకట్టి పొరలా మారిపోతుంది. హిమపాతం కారణంగా నీటి పైపులలో నీళ్లు కూడా గడ్డకట్టి పంపింగ్ ఆగిపోతుంది. సహజంగానే మౌంట్ అబూకి పర్యాటకుల తాకిడి అధికంగా ఉంటుంది. గుజరాత్, రాజస్థాన్ తో పాటు దేశవ్యాప్తంగా పర్యాటకులు ఇక్కడకి వస్తుంటారు. ఇప్పుడు హిమపాతం కారణంగా పర్యాటకులు మరికాస్త ప్రకృతిని ఆస్వాదిస్తున్నారు. అయితే.. వృద్దులు కొందరు చలికి తట్టుకోలేక ప్రాణాలు కోల్పోతున్నారు. మరికొందరు అనారోగ్యాల పాలవుతున్నారు.