TS Congress: 12 మంది ఎమ్మెల్యేలపై డీజీపీకి ఫిర్యాదు.. మైలేజ్ ఇచ్చేనా?

Kaburulu

Kaburulu Desk

January 10, 2023 | 11:25 AM

TS Congress: 12 మంది ఎమ్మెల్యేలపై డీజీపీకి ఫిర్యాదు.. మైలేజ్ ఇచ్చేనా?

TS Congress: కాంగ్రెస్ పార్టీలో గెలిచి టీఆర్ఎస్ పార్టీలో చేరిన 12 మంది ఎమ్మెల్యేలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి డీజీపీకి ఫిర్యాదు చేశారు. తమ పార్టీ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ పార్టీ కొనుగోలు చేసిందని.. ఈ మేరకు కేసు నమోదు చేసి సీబీఐతో విచారణ జరిపించాలని రేవంత్ కోరారు. రేవంత్ వెంట మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డితో ఇతర కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. అంతా కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ నాయకులు.. ఈమేరకు విచారణ జరిపించాలని కోరారు.

2018 ఎన్నికల్లో మొత్తం 19 సీట్లలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించగా.. హుజూర్ నగర్ ఎమ్మెల్యేగా గెలిచిన అప్పటి పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి.. ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో నల్గొండ నుంచి ఎంపీగా విజయం సాధించి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. హుజూర్‌నగర్ నుంచి తన భార్యను రంగంలోకి దింపినా ఆ ఎన్నికల్లో పద్మావతి రెడ్డి ఓడిపోయారు. దీంతో కాంగ్రెస్ బలం 18కి పడిపోగా.. అందులో 12 మంది కాంగ్రెస్‌ను వీడి టీఆర్ఎస్‌లో చేరారు.

కాంగ్రెస్ నుండి టీఆర్ఎస్ లోకి వెళ్లిన వారిలో కొందరికి మంత్రి పదవులు కూడా దక్కగా.. ఇప్పుడు రేవంత్ అండ్ కో తమ పార్టీ 12 మంది ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ కొనుగోలు చేసిందని.. విచారణ జరిపించాలని కోరారు. నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు బీజేపీ కుట్రం చేసిందని కేసీఆర్ ఎలాగైతే ఆరోపిస్తున్నారో.. ఇప్పుడు అచ్చం అలాగే తమ పార్టీ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ కొనుగోలు చేసిందని కాంగ్రెస్ ఆరోపణలు మొదలు పెట్టింది.

అయితే.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు ప్రయత్నం చేసిందనే ఆరోపణలు టీఆర్ఎస్ పార్టీకి ఎంతో మైలేజ్ ఇచ్చాయి. పక్కా ప్రణాళిక ప్రకారం ఆడియో, వీడియోలతో సహా ఇది బట్టబయలు పెట్టడంతో పాటు ఔను నిజమే అనేలా టీఆర్ఎస్ పార్టీ నమ్మించ గలిగింది. ఆ ఎమ్మెల్యేలు కూడా తమని ట్రాప్ చేసేందుకు ప్రయతించారని ఓపెన్ అయ్యారు. అయితే.. కాంగ్రెస్ పరిస్థితి వేరు. అప్పుడెప్పుడో ఎమ్మెల్యేలు పార్టీ మారితే ఇప్పుడు ఫిర్యాదు చేశారు.

పైగా కొనుగోలు చేశారని చెప్పుకొనేందుకు ఎలాంటి ఆధారాలు లేవు. వాళ్ళకి వాళ్ళే ఇష్టపూర్వకంగా కేసీఆర్ పాలన నచ్చి టీఆర్ఎస్ పార్టీలో చేరామని ఆ ఎమ్మెల్యేలే చెప్పుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇది కాంగ్రెస్ పార్టీకి ఎంత మైలేజ్ ఇస్తుందన్నది ప్రశ్నార్ధకం. టీఆర్ఎస్ టార్గెట్ గా రేవంత్ తన ప్రయత్నం తానైతే చేస్తున్నారు కానీ.. అవుట్ డేటెడ్ ప్రయత్నాలతో పార్టీకి మేలు జరిగేనా అన్నది చూడాల్సి ఉంది.