Revanth Reddy: రాహుల్ గాంధీపై అనార్హత వేటు మంటలు.. మోడీ ఓ నియంతని రేవంత్ విమర్శలు!

Kaburulu

Kaburulu Desk

March 26, 2023 | 04:41 PM

Revanth Reddy: రాహుల్ గాంధీపై అనార్హత వేటు మంటలు.. మోడీ ఓ నియంతని రేవంత్ విమర్శలు!

Revanth Reddy: పరువు నష్టం దావా కేసులో రెండు సంవత్సరాలు శిక్ష ఖరారైన నేపథ్యంలో రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వాన్ని కూడా అనర్హతకు గురి చేస్తూ లోక్ సభ స్పీకర్ కార్యాలయం నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ పరిణామాలపై దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. మరోవైపు దేశవ్యాప్తంగా ప్రధాన ప్రతిపక్షాలన్నిటిలో ఒక్క సారిగా కదలిక తీసుకొచ్చి వారందరినీ ఏకం చేసే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు.

ఇప్పటికే రాహుల్ గాంధీకి మద్దతుగా ఆ పార్టీ ఢిల్లీలోని రాజ్ ఘాట్‌లో ‘సంకల్ప్ సత్యాగ్రహ’ను ప్రారంభించింది. రాజ్ ఘాట్ ఏరియాలో 144 సెక్లన్ అమలులో వున్నప్పటికీ కాంగ్రెస్ నేతలు సత్యాగ్రహ చేపట్టడం గమనార్హం. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే, ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రాతో పాటు ఇతర సీనియర్ నాయకులు కేసీ వేణుగోపాల్, పీ. చిదంబరం, జైరాం రమేష్, ఇతర నేతలు నిరసనలో పాల్గొన్నారు. పోలీసుల ఆంక్షలను లెక్క చేయకుండా పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు కూడా సత్యాగ్రహను మొదలు పెట్టారు.

ఇక, మన తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఈ విషయంపై తీవ్రంగా స్పందిస్తున్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని, ప్రధాని నరేంద్ర మోడీపై ఘాటు విమర్శలకు దిగుతున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ నయా నియంతలా మారారని టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శించారు. రాహుల్ గాంధీ పై అనార్హత వేటుకు వ్యతిరేకంగా గాంధీ భవన్ లో నిర్వహించిన సత్యాగ్రహ నిరసన దీక్షలో పాల్గొన్న రేవంత్ రెడ్డి మోడీపై తీవ్ర విమర్శలు చేశారు.

రేవంత్ మాట్లాడుతూ.. మోడీ హయాంలో ప్రజాస్వామ్య వ్యవస్థకు తూట్లు పెడుతున్నారని మండిపడ్డారు. ప్రశ్నించే గొంతును నొక్కుతున్నారని.. రాహుల్ గాంధీని ఎదుర్కొనే ధైర్యం లేక బిజెపి సర్కార్ ఆయన పై కుట్ర చేసిందని ఆరోపించారు. తన మిత్రుడైన అదానీ కోసం మొత్తం దేశాన్ని కొల్లగొడుతున్నారని అన్నారు. అదాని, ప్రధాని డబుల్ ఇంజన్ తరహాలో బీజేపీ ప్రభుత్వం నడుస్తుందని ఏద్దెవా చేశారు. ఇక దీక్ష ముగిసిన తర్వాత తదుపరి కార్యాచరణపై సమిష్టిగా నిర్ణయం తీసుకుంటామన్నారు రేవంత్ రెడ్డి.