YSRCP MLA: ఇప్పటి రాజకీయాలకు పోరంబోకులు కావాలి.. ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు!

Kaburulu

Kaburulu Desk

January 10, 2023 | 12:01 PM

YSRCP MLA: ఇప్పటి రాజకీయాలకు పోరంబోకులు కావాలి.. ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు!

YSRCP MLA: ఇప్పటి రాజకీయాలకు పది మంది పోరంబోకులను వెంటేసుకుని తిరిగే వాళ్ళే కావలి.. అలా ఉంటేనే నాయకుడిగా ముందుకు సాగే పరిస్థితి ఉందని వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అప్పటి రాజకీయాలకు.. ఇప్పటి రాజకీయాలకు చాలా తేడా ఉందన్న ఆయన ఇప్పటి రాజకీయాల్లో పోరంబోకులు ఉండాలన్నారు. అలా రాజకీయం చేతకాకనే తాను పాత తరం నాయకుడిగానే మిగిలిపోయానని వసంత కృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు.

తన తండ్రి వసంత నాగేశ్వరరావు కాలం నాటి రాజకీయాలు ఇప్పుడు లేవన్న ఆయన.. ఇప్పటి రాజకీయాలలో పెద్దరికం పనికిరాదన్నారు. అయితే.. తాను మాత్రం రాజకీయాల్లో హుందాగానే ఉంటానని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తెలిపారు. అకారణంగా ప్రతిపక్షాలపై తప్పుడు కేసులు బనాయించనని వసంత తేల్చిచెప్పేశారు. అందుకే పార్టీలో కొందరికి తనపై అసంతృప్తి అని వసంత తెలిపారు.

గత మూడున్నరేళ్ల కాలంలో ఒక్కరిపై కూడా తాను అక్రమ కేసులు పెట్టించలేదని.. ఈ విషయంలో తనపై తమ పార్టీలోని కొందరు నేతలకు అసంతృప్తి ఉండొచ్చని అన్నారు. రౌడీలను వెంటేసుకుని ఇతర ఎమ్మెల్యేల మాదిరి ప్రవర్తిస్తేనే రాజకీయాల్లో ముందడుగు వేసేలా పరిస్థితులు ఉన్నాయని చెప్పారు. రాజకీయాల్లోకి ఎందుకొచ్చానా, ఎమ్మెల్యే ఎందుకయ్యానా అని ఒక్కోసారి అనిపిస్తుంటుందని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన.. ఎమ్మెల్యేగా ఉండి కూడా సాటి వ్యక్తులకు సాయం చేయలేకపోతున్నానని చెప్పారు.

తాజాగా గుంటూరులో సంక్రాంతి కానుకల పంపిణీలో తొక్కిసలాట జరిగి ముగ్గురు మరణించిన సంగతి తెలిసిందే. కాగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఎన్ఆర్ఐ ఉయ్యురు శ్రీనివాస్ పై కేసు నమోదు చేశారు. ఉయ్యురు శ్రీనివాస్ ఎమ్మెల్యే వసంత ప్రసాద్ కు దగ్గరి స్నేహితుడు కాగా.. దీనిపై ఎమ్మెల్యే తీవ్రంగా అసంతృప్తి చెందారు. అప్పటి నుండే ప్రభుత్వంపై పరోక్ష విమర్శలు చేస్తున్న వసంత ప్రసాద్ ఇప్పుడు ఇలా ఆవేదన వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు. మరి తదుపరి కార్యాచరణ ఎలా ఉండబోతుందో చూడాలి.