Kuppam Tour: రోడ్డుపై బైఠాయించిన చంద్రబాబు.. గుడిపల్లిలో ఉత్కంఠ

Kaburulu

Kaburulu Desk

January 6, 2023 | 04:13 PM

Kuppam Tour: రోడ్డుపై బైఠాయించిన చంద్రబాబు.. గుడిపల్లిలో ఉత్కంఠ

Kuppam Tour: చంద్రబాబు సొంత జిల్లా కుప్పంలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. మూడు రోజుల క్రితం కుప్పంలో రోడ్ షోకు వెళ్లిన చంద్రబాబుకు చిత్తూరు పోలీసులు అనుమతి నిరాకరించడం.. అయినా చంద్రబాబు బెంగళూరు నుండి చిత్తూరులో ప్రవేశించడం.. పోలీసులు అడ్డుకోవడం.. ప్రచార రథాన్ని సీజ్ చేసి మైకులు తొలగించడం.. కార్యకర్తలు, పోలీసుల మధ్య తోపులాట, లాఠీఛార్జ్.. చివరికి చంద్రబాబు కాన్వాయ్ వదిలి నడుచుకుంటూ సభాస్థలికి చేరుకొని కార్యకర్తలలో సమావేశమయ్యారు.

కాగా.. అప్పటి నుండి చిత్తూరులోనే ఉన్న చంద్రబాబు మూడవ రోజు కూడా పర్యటనకు వెళ్లారు. ముందుగా గుడిపల్లి చేరుకున్న చంద్రబాబుని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల ఆంక్షలకు నిరసనగా చంద్రబాబు స్థానిక బస్టాండ్ సమీపంలో రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు. ఆయన పార్టీ కార్యాలయానికి వెళ్లేందుకు యత్నించినా.. పోలీసులు అడ్డుకోవడంతో రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. కుప్పంలో సీజ్ చేసిన ప్రచార రథం అప్పగించాలంటూ డిమాండ్ చేశారు.

మరోవైపు గుడిపల్లి వచ్చే అన్ని రహదారులకు పటిష్ట పోలీసు భద్రత ఏర్పాటు చేసి కార్యకర్తలు రాకుండా అడ్డుకొనే ప్రయత్నం చేశారు. గుడిపల్లిలో భారీగా పోలీసులు మోహరించారు. దీంతో రోడ్డుపైన బైఠాయించిన చంద్రబాబు మాట్లాడుతూ.. మూడు రోజులుగా పోలీసుల అరాచకాలను చూస్తున్నామన్నారు. పోలీసులూ ఏంటీ ఈ బానిసత్వం.. బానిసలుగా బ్రతకొద్దు అంటూనే.. మీరు ఇష్టానుసారం ప్రవర్తిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ప్రజలు తిరగబడితే మీరు రోడ్ల మీద కూడా తిరగలేరు.. గాల్లోనే తిరగాల్సి వస్తుందని హెచ్చరించారు.

ఇక, ఇక్కడ నుండి నన్ను పంపేయాలని చూస్తే మిమ్మల్నే పంపిస్తా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతలు ర్యాలీలు చేస్తున్నారని.. జగన్ రాజమండ్రిలో మీటింగ్ పెట్టలేదా? రోడ్ షో చేయలేదా? వారికో రూలు…తమకో రూలా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నా నియోజకవర్గంలోనూ నేను పర్యటించకూడదా?.. నా ప్రజలను కలిసేందుకు నాకు హక్కు లేదా? అంటూ ప్రశ్నించిన చంద్రబాబు.. ప్రజాహితం కోసమే నా పోరాటం. ప్రజల కోసం ప్రాణాలు ఇచ్చేందుకు కూడా సిద్ధమే అంటూ మాట్లాడారు.