EX Minister Narayana: మాజీ మంత్రి నారాయణకు ఏపీ సీఐడీ మరో షాక్.. హైదరాబాద్ నివాసాలలో సోదాలు!

Kaburulu

Kaburulu Desk

February 24, 2023 | 01:22 PM

EX Minister Narayana: మాజీ మంత్రి నారాయణకు ఏపీ సీఐడీ మరో షాక్.. హైదరాబాద్ నివాసాలలో సోదాలు!

EX Minister Narayana: ఏపీ మాజీ మంత్రి నారాయణకు ఏపీ సీఐడీ మరోసారి షాక్ ఇచ్చింది. హైదరాబాద్ లోని నారాయణ కుమార్తె శర్వాణి నివాసంలో సీఐడీ అధికారులు శుక్రవారం భారీస్థాయిలో సోదాలు నిర్వహించారు. కూకట్ పల్లి, కొండాపూర్, మాదాపూర్, గచ్చిబౌలిలోని ఇళ్లలో తనిఖీలు చేపట్టింది. రాజధాని అమరావతి భూముల కొనుగోలు అంశంలో సీఐడీ అధికారులు ఈ సోదాలు జరిపినట్లుగా సమాచారం. మనీ రూటింగ్ కు పాల్పడి అమరావతిలో భూములను కొనుగోలు చేసినట్లుగా సీఐడీ అధికారులు గుర్తించినట్లు అనుమానిస్తున్నారు.

నారాయణ అమరావతిలో దాదాపు 146 ఎకరాల భూమిని కొనుగోలు చేయగా, ఇందుకు సంబంధించి ఆధారాలతో ఈ సోదాలు నిర్వహిస్తున్నట్లుగా సమాచారం. మంత్రి నారాయణ నివాసంలోను సోదాలు నిర్వహించినట్లుగా తెలుస్తోంది. నారాయణ పైన గతంలోను పలు కేసులు నమోదయ్యాయి. ఇన్నర్ రింగ్ రోడ్డు, అమరావతి రాజధాని తదితర కేసులు ఉన్నాయి. దీంతో పాటు పదో తరగతి పరీక్షా ప్రశ్నా పత్రాల లీకేజీ కేసు కూడా నమోదవగా ఇప్పటికే ఒకసారి సీఐడీ సోదాలు నిర్వహించింది.

కాగా, ఇప్పుడు ఆయన కుమార్తెను కూడా సీఐడీ టార్గెట్ చేసి సోదాలు నిర్వహించడం ఆసక్తిగా మారింది. అయితే, ఏ విషయంలో నారాయణ కుమార్తె నివాసంలో సీఐడీ సోదాలు చేస్తున్నారనే విషయాన్ని మాత్రం అధికారులు వెల్లడించలేదు. టెన్త్ పేపర్ లీకేజీ వ్యవహారంలోనే ఈ సోదాలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. సోదాలకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

నారాయణ విషయానికి వస్తే.. నారాయణ విద్యా సంస్థల చైర్మన్ గా తెలిసిన ఆయనను టీడీపీ అధినేత చంద్రబాబు గత ప్రభుత్వంలో మంత్రిని చేశారు. కొత్త రాష్ట్ర రాజధాని అమరావతి అభివృద్ధి ప్రణాళికలోను నారాయణకు భాగస్వామ్యం కల్పించారు. కాగా, నాడు ఎన్నికల అఫిడవిట్ లో రూ.477 కోట్ల ఆదాయాన్ని చూపించిన నారాయణ.. అప్పుడు దేశంలో అత్యంత సంపన్న మంత్రుల్లో ఒకరిగా నిలిచి రికార్డు సృష్టించారు.