Ippatam: ఏపీలో మరో ఉద్రిక్తత.. ఇప్పటంలో మళ్ళీ కూల్చివేతలు.. రేపు జనసేన రాష్ట్ర వ్యాప్త ఆందోళన!

Ippatam: ఇప్పటంలో మళ్ళీ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. గ్రామంలో ఇళ్లు కూల్చివేసేందుకు మున్సిపల్ అధికారులు జేసీబీలతో రాగా గ్రామస్తులు వారిని అడ్డుకున్నారు. మా ఇళ్ల జోలికివస్తే మేం ఆత్మహత్య చేసుకుంటామని బాధితులు వాపోయారు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఇప్పటికే గ్రామంలో రోడ్డు విస్తరణ నేపథ్యంలో 90 శాతం ఇళ్లను కూల్చివేశారు. మిగిలిన కట్టడాలను కూల్చివేసేందుకు మున్సిపల్ అధికారులు సిద్ధమయ్యారు.
శనివారం రెండు జేసీబీల సహాయంతో పన్నెండు ఇళ్ల ప్రహరీ గోడలను కూల్చివేశారు. ఇప్పటం జనసేన పార్టీ అధ్యక్షుడు నరసింహారావు నివాసాన్ని కూల్చేందుకు అధికారులు ప్రయత్నించగా స్థానికులు అడ్డుకున్నారు. దీంతో ప్రవారీ వరకు కూల్చివేశారు. ఈ కూల్చివేతలను అడ్డుకున్న వారిని కొందరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో ఏపీలో వైసీపీ నేతల తీరుపై పీఏసీ చైర్మన్, జనసేన నేత నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు. రేపు ఇప్పటం గ్రామంలోని కూల్చివేతలపై రాష్ట్ర వ్యాప్త ఆందోళన చేపడతామని నాదెండ్లమనోహర్ ప్రకటించారు.
ఇప్పటంలో అరెస్టు చేసిన జనసేన నాయకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అరెస్ట్ చేసిన వారిని విడుదల చేయకపోతే పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు ఆందోళన చేపడతామని అన్నారు. రాజమండ్రిలో నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పైశాచిక ఆనందంతో ఇప్పటం గ్రామంలో భూములు ఇచ్చిన రైతుల ఇళ్లను కూలగొడుతున్నారని ఆరోపించారు.
విశాఖ సమ్మిట్ ద్వారా రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకువస్తారనే ఉద్దేశంతో రెండు రోజులు వైసీపీపై విమర్శలు చేయకూడదని నిర్ణయం తీసుకున్నామని.. కానీ, వైసీపీ నేతలు కావాలనే ఇప్పటం గొడవను మళ్ళీ రెచ్చగొట్టారని, అం దుకే విమర్శలు చేయక తప్పలేదని వివరణ ఇచ్చారు. గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి కచ్చితంగా జనసేన అధికారంలోకి రాబోతుందని.. మీరు చేసే ఈ అన్యాయాలకి ప్రతి వైసీపీ ఎమ్మెల్యే గుర్తు పెట్టుకోవాలని హెచ్చరించారు.