Global Investment Summit 2023: నేడు విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్.. రెండు రోజుల పాటు సదస్సు!

Kaburulu

Kaburulu Desk

March 3, 2023 | 08:40 AM

Global Investment Summit 2023: నేడు విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్.. రెండు రోజుల పాటు సదస్సు!

Global Investment Summit 2023: ఏపీ ప్రభుత్వం గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్‌ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది. నేడు (మార్చి 3) ఉదయం విశాఖపట్నం వేదికగా ఈ పెట్టుబడి దారుల సదస్సు ప్రారంభం కానుంది. ఇందుకోసం ప్రభుత్వం ఇప్పటికే భారీగా ఏర్పాట్లు చేసింది. జగన్ మోహన్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత తొలిసారి నిర్వహిస్తున్న గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్‌ ఇదే కాగా దీనికి విశాఖపట్నంను వేదికగా ఎంచుకున్నారు. మొత్తం రెండ్రోజుల పాటు సమ్మిట్ నిర్వహణ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షించేందుకు రెండ్రోజుల పాటు ఈ సదస్సును నిర్వహించనుండగా.. ఆంధ్రా యూనివర్శిటీ ఇంజినీరింగ్‌ కళాశాల ప్రాంగణంలో శుక్రవారం ఉదయం ఈ సమ్మిట్ ప్రారంభం కానుంది. దేశ, విదేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, వివిధ దేశాల రాయబారులు, వాణిజ్య ప్రతినిధులు దాదాపు 8-10 వేల మంది వరకు ఈ సదస్సుకు హాజరవుతారని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది.

కేంద్రమంత్రులు నితిన్‌ గడ్కరీ, కిషన్‌రెడ్డి, రిలయన్స్‌ గ్రూప్‌ అధినేత ముఖేష్‌ అంబానీ, ఆదిత్య బిర్లా గ్రూప్‌ ఛైర్మన్‌ కుమారమంగళం బిర్లా, టాటా గ్రూప్‌ ఛైర్మన్‌ నటరాజన్‌ చంద్రశేఖరన్‌, జీఎంఆర్‌ గ్రూప్‌ అధినేత జి.మల్లికార్జునరావు తదితర పారిశ్రామిక దిగ్గజాలు ఈ సదస్సులో పాల్గొంటున్నారు.శుక్రవారం ఉదయం 10 నుంచి 2 గంటల వరకు వివిధ పారిశ్రామిక, వాణిజ్య సంస్థలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థలు 118 స్టాల్స్‌తో ఏర్పాటుచేసిన ఎగ్జిబిషన్‌ను ప్రారంభిస్తారు.

పెట్టుబడిదారుల సదస్సుకు ప్రభుత్వం విస్తృతంగా ఏర్పాట్లు చేసింది. ఐదు భారీ హాళ్లలో సమావేశాలను నిర్వహిస్తోండగా.. మూడో నెంబరు హ్యాంగర్‌లో ప్రారంభ, ముగింపు కార్యక్రమాలు నిర్వహిస్తారు. రెండువేల మందికిపైగా కూర్చునేలా అందులో ఏర్పాట్లు చేశారు. మొదటి హాలును పూర్తిగా అతిథుల భోజనాలకు కేటాయించారు. రెండో హ్యాంగర్‌లో ఎగ్జిబిషన్‌ స్టాల్స్‌ .. నాలుగో హ్యాంగర్‌ లో సీఎం, కేంద్ర మంత్రులు, రాష్ట్ర ఆర్థిక, పరిశ్రమల శాఖల మంత్రులకు ప్రత్యేక లాంజ్‌లు, సీఎంతో పారిశ్రామిక ప్రముఖుల భేటీకి సమావేశ మందిరం, మీడియా హాల్‌ ఏర్పాటు చేశారు. ఐదో హ్యాంగర్‌లో సెమినార్లు నిర్వహిస్తారు.