BRS-AIMIM: అనుకున్నదే అయింది.. మజ్లీస్ ఎమ్మెల్సీ అభ్యర్ధికి బీఆర్ఎస్ మద్దతు!

Kaburulu

Kaburulu Desk

February 21, 2023 | 10:56 PM

BRS-AIMIM: అనుకున్నదే అయింది.. మజ్లీస్ ఎమ్మెల్సీ అభ్యర్ధికి బీఆర్ఎస్ మద్దతు!

BRS-AIMIM: ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ స్థానాల్లో ఎన్నికల నిర్వహణకు ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. మార్చి నెల 13వ తేదీన హైదరాబాద్‌ స్థానిక సంస్థల స్థానంతో పాటు హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ ఎవరిని నిలబెడుతుంది.. బీఆర్ఎస్ మద్దతు ఇస్తుందా అనే ఆసక్తి కనిపించింది.

అయితే, ఎంఐఎం పార్టీని మిత్రపక్షంగానే చూస్తున్న బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలలో మద్దతు ఇస్తుందని అందరూ భావించారు. అందరూ అనుకున్నట్లుగానే స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని అధికార బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు బీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకన్నారు. మిత్రపక్షమైన మజ్లిస్ చేసిన అభ్యర్థన మేరకు మద్దతు ప్రకటిస్తున్నట్లు బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి.

పార్టీలోని సీనియర్లతో చర్చించిన అనంతరం హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో మజ్లిస్ అభ్యర్థికి సంపూర్ణ మద్దతు ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించినట్లు పేర్కొన్నాయి. రాష్ట్ర ప్రభుత్వానికి పలు సందర్భాల్లో ఎంఐఎం కూడా మద్దతుగా నిలిచిన నేపథ్యలోనే బీఆర్ఎస్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా, హైదరాబాద్ స్థానిక సంస్థల ఎంఐఎం అభ్యర్థిగా మీర్జా రెహమత్ బేగ్‌ను ఆ పార్టీ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ప్రకటించిన సంగతి తెలిసిందే.

కాగా, మహబూబ్ నగర్-రంగారెడ్డి-హైదారాబద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాన్ని కైవసం చేసుకొని, రాజకీయంగా బలంగా ఉన్నామనే సంకేతాలను ప్రజల్లోకి పంపాలని రాజకీయ పార్టీలన్నీ భావిస్తున్నాయి. బలమైన అభ్యర్థులను పోటీలో నిలిపి సత్తా చాటేందుకు వ్యూహాలు రచిస్తున్నాయి. బీజేపీ ఇప్పటికే టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికకు తమ అభ్యర్థిగా వెంకట నారాయణ రెడ్డిని బరిలోకి దింపబోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.