Teenmaar Mallanna: బీఆర్ఎస్ రాజకీయ పార్టీ కాదు గూండా పార్టీ.. తీన్మార్ మల్లన్న అరెస్టుపై బండి ఆగ్రహం!

Kaburulu

Kaburulu Desk

March 22, 2023 | 11:55 AM

Teenmaar Mallanna: బీఆర్ఎస్ రాజకీయ పార్టీ కాదు గూండా పార్టీ.. తీన్మార్ మల్లన్న అరెస్టుపై బండి ఆగ్రహం!

Teenmaar Mallanna: ప్రముఖ జర్నలిస్ట్ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తీన్మార్ మల్లన్న క్యూ న్యూస్ కార్యాలయంలో గత రాత్రి సోదాలు నిర్వహించిన పోలీసులు అనంతరం ఆయనతో పాటు తెలంగాణ విఠల్‌ను కూడా అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. తీన్మార్ మల్లన్నను అదుపులోకి తీసుకోవడాన్ని తెలంగాణ బీజేపీ తీవ్రంగా ఖండించింది. అరెస్ట్ చేసిన వారిని వెంటనే వదిలిపెట్టాలని, లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది.

మరోవైపు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్.. మల్లన్న కుటుంబాన్ని కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ రాజకీయ పార్టీలా కాకుండా గూండా పార్టీలా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. క్యూ న్యూస్ ఆఫీస్‌పై దాడిచేసి కంప్యూటర్లు ఎత్తుకుపోవడం దుర్మార్గమన్నారు. తనకు విషయం తెలిసిన వెంటనే తీన్మార్ మల్లన్న, విఠల్ ఇంటికి వచ్చినట్టు చెప్పారు. ప్రశ్నించే గొంతులను అణచివేయడం ద్వారా కేసీఆర్ తన గొయ్యిని తానే తవ్వుకుంటున్నారని అన్నారు.

మీడియా కూడా కేసీఆర్ ఒత్తిడితోనే పనిచేస్తోందని, మీడియా ఏదైనా ప్రజలు దానిని విశ్వసించడం లేదని అన్నారు. తీన్మార్ మల్లన్న కార్యాలయంపై సోదాలు, దాడి విషయాన్ని హైలైట్ చేయకపోవడానికి అదే కారణమన్నారు. టీఎస్‌పీఎస్సీ విషయంలో కేటీఆర్ హస్తం ఉందని తీన్మార్ మల్లన్న చెబుతున్నందుకే ఈ దాడి జరిగిందని ఆరోపించారు. పోలీసు అధికారులతో ఫోన్ లో మాట్లాడి, వెంటనే వారిని విడుదల చేయాలని, లేనిపక్షంలో తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.

తీన్మార్ మల్లన్న, తెలంగాణ విఠల్ అరెస్ట్ దుర్మార్గం.. దొంగల్లా వచ్చి ఎత్తుకుపోతారా ? ఖబడ్దార్ కేసీఆర్, వీరందరినీ బేషరతుగా విడుదల చేయాల్సిందే అన్నారు. జర్నలిస్ట్ విఠల్ ఆరోగ్యం బాగోలేదని.. తనకు ఏం జరిగినా కేసీఆరే బాధ్యత వహించాలని.. లేనిపక్షంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. కేసీఆర్ పాలనలో ప్రజాస్వామ్యం మంట కలిసిపోతోంది. తెలంగాణ ఉద్యమకారులారా, ఇప్పటికైనా బయటకురండి, కల్వకుంట్ల కుటుంబ రాక్షస పాలనపై పోరాడుదాం అంటూ బండి సంజయ్ పిలుపునిచ్చారు.