Delhi Liquor Scam: ఈడీ ఆఫీస్‌కు ఎమ్మెల్సీ కవిత.. విచారణకు వెళ్లేముందు ఫోన్ల ప్రదర్శన.. అంతటా ఉత్కంఠ!

Kaburulu

Kaburulu Desk

March 21, 2023 | 12:31 PM

Delhi Liquor Scam: ఈడీ ఆఫీస్‌కు ఎమ్మెల్సీ కవిత.. విచారణకు వెళ్లేముందు ఫోన్ల ప్రదర్శన.. అంతటా ఉత్కంఠ!

Delhi Liquor Scam: ఎమ్మెల్సీ, సీఎం కేసీఆర్ కుమార్తె కవిత మరోసారి ఈడీ విచారణకు హాజరయ్యారు. సోమవారం 10 గంటల పాటు సుదీర్ఘ విచారణ అనంతరం రాత్రి సమయంలో ఆమెను ఇంటికి వెళ్లామన్నారు. అక్కడ నుండి ఢిల్లీలో సీఎం కేసీఆర్ నివాసానికి వెళ్లిన కవిత మంగళవారం ఉదయం కూడా ఈడీ విచారణకు హాజరయ్యారు. భర్త వెంట రాగా ఆమె ఈడీ కార్యాలయానికి వెళ్లారు. ఈడీ ఆఫీసులోకి వెళ్లేముందు ఆమె తన భర్తను ఆలింగనం చేసుకున్నారు.

ఇక ఈడీ విచారణకు బయలుదేరేముందు కవిత పాత ఫోన్లను ప్రదర్శించారు. మొత్తం రెండు బ్యాగుల్లో ఉన్న ఫోన్లను చూపించిన ఆమె.. మీడియాతో ఎటువంటి వ్యాఖ్యలు చేయకుండానే కారులో వెళ్లిపోయారు. ఈ కేసుకు సంబంధించి ఫోన్లు ధ్వంసం చేసినట్టు కవిత ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విచారణకు ముందు కవిత ఫోన్లను ప్రదర్శించడం ఆసక్తికరంగా మారింది. దీంతో, ఆమె ఈడీతో తలపడేందుకు సిద్దమే అన్నట్టుగా ముందుకు సాగుతున్నారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

ఇక ఇప్పటివరకూ ఈడీ అధికారులు కవితను రెండుమార్లు విచారించారు. సోమవారం నాడు ఏకంగా పది గంటల పాటు విచారించారు. దీంతో.. ఈ రోజు ఏం జరగబోతోందా అన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. ఇప్పటికే బీఆర్ఎస్ ముఖ్య నేతలంతా ఢిల్లీలోనే ఉన్నారు. కవిత సోదరుడు మంత్రి కేటీఆర్ ఢిల్లీకి హైదరాబాద్ కు చక్కర్లు కొడుతుండగా.. కజిన్ సోదరుడు ఎంపీ సంతోష్ గత నాలుగైదు రోజులుగా ఢిల్లీలోనే ఉన్నారు.

ఈ కేసులో అరుణ్‌ రామచంద్రపిళ్లైని కవిత బినామీగా చెబుతున్న ఈడీ.. ఇద్దరి మధ్య జరిగిన ఆర్థిక లావాదేవీలపై విచారణ చేస్తున్నట్లుగా సమాచారం. సౌత్‌ గ్రూప్‌తో సంబంధాలపై ప్రశ్నలు కూడా వేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆప్‌కు ముట్టిన రూ.100 కోట్ల గురించి ఈడీ అధికారులు అడుగుతున్నట్లుగా సమాచారం. మరోవైపు ఈ కేసులో కస్టడీ గడువు ముగిసిన వారిని కూడా మరోసారి కస్టడీ పొడగిస్తున్న నేపథ్యంలో కవితను కూడా అరెస్ట్ చేస్తారా అన్న ఉత్కంఠ కొనసాగుతుంది.