Loan App Harassment: లోన్ యాప్ వేధింపులు.. బ్లాక్ మెయిలింగ్తో మరో యువకుడు బలి

Loan App Harassment: పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా.. రిజర్వ్ బ్యాంక్ నుండి లోకల్ రుణ సంస్థల వరకు ఎంత అవగాహనా కల్పించినా.. ఆన్‍లైన్ రుణ యాప్ ల నుండి అప్పులు తీసుకోవడం ఆగడం లేదు.. వారి వేధింపులు ఆగడం లేదు. అవి తట్టుకోలేక ఆత్మహత్యలు ఆగడం లేదు. లోన్ యాప్స్ అమాయకులకు అప్పు ఇచ్చి లక్షల్లో దండుకుంటున్నాయి. అప్పు తీర్చినా కూడా వేధింపులు ఆపడం లేదు. ఇలా లోన్ యాప్ వేధింపులు తాళలేక ఇప్పటికే చాలా మంది ప్రాణాలు తీసుకున్నారు. తాజాగా కృష్ణా జిల్లా అవనిగడ్డలో లోన్‌యాప్ వేధింపులకు మరో యువకుడు బలయ్యాడు.
చల్లపల్లికి చెందిన మహమ్మద్ లోన్‌యాప్ వేధింపులు తట్టుకోలేక ఉరేసుకుని
ఆత్మహత్య చేసుకున్నాడు. విజయవాడ పాల ఫాక్టరీలో ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్న మహమ్మద్.. హీరో ఫైనాన్స్ కార్పొరేషన్‌లో లోన్ తీసుకున్నారు. డబ్బు తిరిగి చెల్లిస్తున్నా.. ఇంకా కట్టాలంటూ వేధించారు. అప్పటికీ తట్టుకున్న మహమ్మద్ లోన్ తీరేవరకు డబ్బు కట్టాడు. అయినా వేధింపులు ఆగలేదు. ఇంకా కట్టాలంటూ తీవ్రంగా హింస పెట్టారు. ఫోన్ లిఫ్ట్ చేయకపోతే అసభ్యకర మెసేజ్‌లు, కాంటాక్ట్ నెంబర్లకు ఫోన్లు చేసి వేధించడం మొదలు పెట్టారు.
దీంతో వేధింపులు భరించలేక మహమ్మద్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మహమ్మద్‌కు రెండేళ్ల క్రితమే వివాహమవగా ఐదు నెలల కుమారుడు కూడా ఉన్నాడు. సోమవారమే ఖమ్మం జిల్లా బాపూజీ తండాకు చెందిన యువకుడు ఆకాశ్ లోన్ యాప్స్ వేధింపులకు బలి కాగా మరుసటి రోజే కృష్ణా జిల్లా యువకుడు బలి కావడం తీవ్ర ఆందోళన కలిగిస్తుంది.
ఖమ్మం జిల్లాకు చెందిన ఆకాశ్ ఖమ్మంలోని ఓ బంగారం షాపులో పనిచేస్తున్నాడు. ఓ ఆన్‌లైన్ యాప్ లో అతను రూ.6 వేలు అప్పుగా తీసుకుని.. అప్పుతో పాటు వడ్డీని కూడా సకాలంలో చెల్లించడంతో పాటుగా అదనంగా రూ.54 వేలు కూడా చెల్లించాడు. అయినా ఆన్ లైన్ రుణ యాప్ వేధింపులు ఆగలేదు. అప్పు చెల్లించకుంటే నీ ఫొటో, మీ కుటుంబ సభ్యుల ఫొటోలు సోషల్ మీడియాలో పెడతామంటూ బెదిరించారు. దీంతో ఆకాష్ ఉసురు తీసుకున్నాడు.