Minister Ambati: వైఎస్ఆర్ సంక్రాంతి లక్కీ డ్రా.. అంబటిపై కేసు నమోదు!

Kaburulu

Kaburulu Desk

January 19, 2023 | 08:10 AM

Minister Ambati: వైఎస్ఆర్ సంక్రాంతి లక్కీ డ్రా.. అంబటిపై కేసు నమోదు!

Minister Ambati: ప్రతిపక్షాలను మాటలతోనే దుమ్ముదులిపేసే మంత్రిగా పేరున్న ఏపీ నీటిపారుదలశాఖ మంత్రి అంబటి రాంబాబుపై పోలీసు కేసు నమోదైంది. అది కూడా ఏపీలో నిషేధించబడిన లాటరీలను నిర్వహించారని.. మోసం చేసి లాటరీ టికెట్లను అమ్మేశారని ఈ కేసు నమోదు కావడం గమనార్హం. మంత్రి అంబటి రాంబాబు ఫోటోతో ముద్రించిన లక్కీ లాటరీ టికెట్లను సత్తెనపల్లి నియోజకవర్గంలో కొందరు అమ్ముతున్నారని జనసేన పార్టీ కార్యకర్తలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.

కాగా, వంద రూపాయలు కట్టి లక్కీ లాటరీలో లక్ష రూపాయలు గెలుచుకోమంటూ వైసీపీ నేతలు ప్రజల్ని మోసం చేస్తున్నారని గుంటూరు జిల్లా జనసేన అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు మాత్రం జనసేన నేతలు ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేయకపోవడంతో గుంటూరు కోర్టును ఆశ్రయించారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన కోర్టు ఈ ఘటనపై జనసేన నేతల ఫిర్యాదు స్వీకరించి సమగ్ర విచారణ ప్రారంభించాల్సిందిగా సత్తెనపల్లి పోలీసులను ఆదేశించింది.

కోర్టు ఆదేశాలతో మంత్రి అంబటిపై సత్తెనపల్లి పోలీసులు సెక్షన్-5 ప్రైజ్ చిట్స్ నగదు బదిలీ చట్టం-1978 కింద కేసు నమోదు చేశారు. ఈ సెక్షన్ కింద అభియోగాలు రుజువైతే రెండేళ్ల జైలు శిక్ష పడే అవకాశముండగా.. ఫిబ్రవరి 21న పోలీసులు దర్యాప్తు చేసి సమగ్ర నివేదికను కోర్టుకు అందించనున్నారు. కాగా.. లాటరీపై దర్యాప్తునకు ఈ నెల 11న జడ్జి ఆదేశాలు జారీ చేయగా మరుసటి రోజు 12వ తేదీ రాత్రి సత్తెనపల్లి పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంత్రి రాంబాబు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సంక్రాంతి సంబరాల్లో లక్కీ డ్రా నిర్వహించినట్లు ప్రచారం జరుగుతుంది.

ఈ లాటరీని నిర్వహిస్తుంది మంత్రి అంబటి అనుచరులేనని.. లాటరీ టికెట్లను కొనమని మంత్రి కూడా స్వయంగా ప్రజలకు చెప్తున్నారని తొలి నుండి జనసేన నేతలు ఆరోపిస్తున్నారు. లాటరీ టికెట్లపై కూడా మంత్రి అంబటి, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు ఫోటోలు ముద్రించి ఉండగా.. స్వయంగా మంత్రి అంబటినే ఈ లాటరీ లక్కీ డ్రా నిర్వహించినట్లు ప్రచారం జరుగుతుంది. మరి రేపు పోలీసు దర్యాప్తు నివేదిక ఎలా ఉండనుండో చూడాలి.