Dharmana Prasada Rao: రాజధాని రావడమా.. ప్రత్యేక రాష్ట్రమా.. తగ్గేదేలే!

Kaburulu

Kaburulu Desk

January 14, 2023 | 08:39 PM

Dharmana Prasada Rao: రాజధాని రావడమా.. ప్రత్యేక రాష్ట్రమా.. తగ్గేదేలే!

Dharmana Prasada Rao: ఒకవైపు ఏపీ ప్రభుత్వం మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నామని బల్లగుద్ది చెప్తుండగా.. ఈనెల 31న సుప్రీంకోర్టు తీర్పు ఎలా ఉండబోతుందన్న ఆసక్తి ఏపీ రాజకీయ వర్గాలలో కనిపిస్తుంది. ఇప్పటికీ అమరావతి రైతులు నిరసన గళం వినిపిస్తుండగా.. ఉగాది తర్వాత పరిపాలన విశాఖ నుండే కొనసాగనుందని.. ఈ మేరకు ప్రభుత్వంలో ముహూర్తం కూడా ఖరారైందని ప్రచారం జరిగిపోతుంది.

మరోవైపు ఉత్తరాంధ్ర నుండి కొత్త డిమాండ్ ఒకటి తెరపైకి వచ్చి క్రమేపీ ఇది బలపడుతూ వస్తుంది. ప్రభుత్వం చెప్తున్నట్లుగా మూడు రాజధానులు ఏర్పాటు చేసి.. విశాఖకు పరిపాలన రాజధానిగా ఉండడమా.. లేకపోతే విశాఖ రాజధానిగా ఉత్తరాంధ్రను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించడమా ఏదోఒకటి తేలాలని ఆ ప్రాంతం నుండి కొందరు డిమాండ్ తెరపైకి తెస్తున్నారు. దీనిపై గత నెలలో మంత్రి ధర్మాన ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

ప్రభుత్వంలో ఉన్న పార్టీ నేతగా.. ఉత్తరాంధ్ర మంత్రిగా ధర్మాన విశాఖ రాజధానిగా ఉండాలని అది.. ప్రత్యేక రాష్ట్రమా.. మూడు రాజధానులా తేలుస్తామని ప్రకటించారు. దీనిపై అప్పుడే దుమారం రేగింది. అయినా వెనక్కు తగ్గని ధర్మాన ఇప్పుడు కూడా మళ్ళీ అదే తరహా వ్యాఖ్యలు చేశారు. ఈ మధ్యనే ధర్మాన డిమాండ్‌పై పవన్ కల్యాణ్ శ్రీకాకుళం సభలో ఫైర్ అయిన విషయం తెలిసిందే. ఇలా ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేలా మాట్లాడితే.. ప్రజలే తరిమికొడతారని అన్నారు. అలాగే చాలా ఏళ్ళు నుంచి మంత్రిగా ఉన్న ధర్మాన వెనుకబడిన ఉత్తరాంధ్రకు ఏం చేశారని ప్రశ్నించారు.

పవన్ వ్యాఖ్యలపై ధర్మాన మళ్ళీ కౌంటర్ వేయడంతో పాటు రాజధానిపై అదే వ్యాఖ్యలు రిపీట్ చేశారు. ఇక్కడ ప్రజల పన్నులన్నీ తీసుకువెళ్లి అమరావతి అభివృద్ధి చేస్తామంటే ఈ ప్రాంత వ్యక్తిగా తాను అంగీకరించనని, చంద్రబాబుకు పొరపాటున అధికారం ఇస్తే మళ్ళీ అమరావతిలోనే పెట్టుబడి పెడతారన్నారు. అమరావతి పేరుతో జరుగుతున్న రియల్‌ఎస్టేట్‌ను పవన్ సమర్థిస్తున్నారని, పవన్ కల్యాణ్‌కు ఒక స్టాండ్ లేదని, తన లక్ష్యాన్ని ఎందుకు చేరుకోలేకపోతున్నారో పవన్‌ ఆలోచించాలని ధర్మాన అన్నారు. ఎట్టి పరిస్థితిలో విశాఖలోనే రాజధాని ఉండాలని.. అది ప్రత్యేక రాష్ట్రమా.. మూడు రాజధానులా తేల్చుకోవాల్సిన సమయం దగ్గరలోనే ఉందని చెప్పారు. దీంతో ధర్మాన వ్యాఖ్యలు మరోసారి హాట్ టాపిక్ అవుతున్నాయి.