Angkor Wat: ప్రపంచంలోనే అతిపెద్ద విష్ణు దేవాలయమేదో తెలుసా…?

Kaburulu

Kaburulu Desk

January 18, 2023 | 10:40 PM

Angkor Wat: ప్రపంచంలోనే అతిపెద్ద విష్ణు దేవాలయమేదో తెలుసా…?

హిందూ దేవాలయాలకు, హిందూ మతానికి భారతదేశం అతి పెద్ద దేశం అని చాలా మంది ప్రజలు అనుకుంటారు. హిందూ దేవాలయాలు ఇండియాలో ఉన్నంతగా మరే దేశంలో కూడా లేవని కొందరు అభిప్రాయ పడుతూ ఉంటారు. ప్రస్తుతం ఇండియాలో హిందువులు ఎక్కువ ఉన్నారన్న మాట వాస్తవమే, ప్రస్తుతం ఇండియాలోనే దేవాలయాల సందర్శన ఎక్కువ ఉంటుంది అది కూడా నిజమే. కానీ ప్రపంచంలోనే అతిపెద్ద విష్ణు దేవాలయమైన అంగ్ కోర్ వాట్ దేవాలయం మాత్రం కాంబోడియా నగరంలో ఉంది. దాని గురించిన వివరాలు ఇపుడు తెలుసుకుందాం.

ఆంగ్‌కార్ వాట్‌ దేవాలయం కంపూచియాలోని సీమ్‌ రీప్‌ పట్టణానికి సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది. హిందూ సంస్కృతీ సంప్రదాయాలు ప్రతిబింబించే అద్భుతమైన శిల్పకళా నైపుణ్యం ఇక్కడ కనిపిస్తుంది. భారతీయ ఇతిహాసాలను తనలో ఇముడ్చుకుని అందరినీ ఆకట్టుకుంటోంది. అంతేకాదు ఈ దేవాలయం ఆ దేశ జాతీయ పతాకంలో కూడా స్థానం సంపాదించుకుంది. ఈ ఆలయానికి కొన్ని శతాబ్దాల చరిత్ర ఉంది. ఖ్మేర్‌ సామ్రాజ్యంలో ఈ అద్భుత కట్టడానికి అంకురార్పణ జరిగింది. సా.శ. 12వ శతాబ్దకాలంలో ఆంగ్‌కార్ వాట్‌ను రాజధానిగా చేసుకుని పాలించిన రెండవ సూర్యవర్మన్‌ కాలంలో ఈ ఆలయ నిర్మాణం జరిగినట్లు చరిత్ర చెబుతోంది.

ఈ ఆలయంలో ఆకట్టుకునే సంఘటన ఏమిటంటే ముఖద్వారం నుండి దేవాలయం లోపలికి వెళ్లగానే చుట్టూ పచ్చని పచ్చికతో అక్కడి వాతావరణమంతా ఆహ్లాదభరితంగా ఉంటుంది. ముఖద్వారం నుండే మూడు పెద్ద పెద్ద గోపురాలు దర్శనమిస్తాయి. ఇందులో మధ్య గోపురం నుండి లోపలికి వెళ్తే అనేక గోపురాలు కనిపిస్తాయి. ఈ దేవాలయంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సూర్యోదయం. ఉషోదయ వేళ ఆలయ దర్శనం అద్భుతంగా ఉంటుంది. పొద్దున లేచి గోపురం వెనుక నుండి ఉదయ భానుడు మెల్లిగా నులి వెచ్చని లేలేత కిరణాల్ని ప్రసరింపజేస్తున్నప్పుడు గుడి గోపురాన్ని చూస్తే చాలు… ఎంతసేపైనా ఆ దృశ్యాన్ని అలాగే చూస్తూ ఉండి పోవాలనిపిస్తుంది. ఎండ వేడెక్కి చుర్రుమనిపించేవరకు అలాగే ఉండిపోతారు కూడా.