Ganta Srinivasa Rao: పార్టీ మార్పు.. ఫుల్ క్లారిటీ ఇచ్చేసిన గంటా!

Kaburulu

Kaburulu Desk

January 18, 2023 | 09:23 PM

Ganta Srinivasa Rao: పార్టీ మార్పు.. ఫుల్ క్లారిటీ ఇచ్చేసిన గంటా!

Ganta Srinivasa Rao: టీడీపీ ఉత్తరాంధ్ర సీనియర్ నాయకుడు, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పార్టీ మారనున్నాడా? అంటే నిన్నటి వరకు రాజకీయ వర్గాలు ముక్త కంఠంతో అవుననే సమాధానాలు ఇచ్చాయి. గత ఏడాదికి పైగా గంటా మౌనం.. ఉత్తరాంద్ర వైసీపీ నేతలంతా టీడీపీ నేతలపై మాటల దాడికి దిగినా గంటా మాత్రం మౌనమే సమాధానంగా ఉంటూ వచ్చారు. ఈక్రమంలోనే గంటా వైసీపీలో చేరనున్నారని కొన్నాళ్ళు.. కాదు కాదు బీజేపీలో చేరనున్నారని మరికొన్నాళ్లు ప్రచారం జరిగింది.

ఈ మధ్యనే నారా లోకేష్ కూడా గంటాతో సమావేశమై గంటకి పైగా చర్చించారు. అయినా కూడా ఆ ప్రచారం మాత్రం ఆగలేదు. అయితే.. ఇన్నాళ్లు మౌనంగానే ఉన్న గంటా ఒక్కసారిగా అందరికీ క్లారిటీ ఇచ్చేశారు. ఒకవైపు రాష్ట్రంలో ఎన్నికల వేడి పెరగడంతో గంటా కూడా మళ్ళీ యాక్టివ్ అయ్యారు. విశాఖపట్నం టీడీపీ కార్యాలయంలో ఎన్టీఆర్ వర్థంతి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన నారా లోకేష్ ప్రారంభిస్తున్న యువగళం పాదయాత్రపై కీలక వ్యాఖ్యలు చేశారు.

ఈనెలలో లోకేష్ చేపడుతున్న యువగళం పాదయాత్ర సెన్సేషనల్ హిట్ అవుతుందని జోష్యం చెప్పిన గంటా.. ప్రస్తుతం దేశానికి యువత వెన్నుముక అని.. అలాంటి యువత రాష్ట్రంలో ఎన్నో ఇబ్బందులు పడుతోందని, అందుకే లోకేష్ పాదయాత్ర విజయవంతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా.. ఉత్తరాంధ్ర ప్రాంతంలో లోకేష్ పాదయాత్ర ఏర్పాట్లను కూడా గంటానే చూసుకోనున్నట్లు తెలుస్తుండగా.. ఈ పాదయాత్రతో గంటా ఫుల్ స్వింగ్ లోకి రానున్నట్లు కనిపిస్తుంది.

కాగా, నారా లోకేష్ పాదయాత్ర ఈ నెల 27 నుంచి ప్రారంభం అవుతుంది. 400 రోజులు.. 4 వేల కిలోమీటర్ల పాదయాత్ర చేయనున్నారు. మొత్తం 175 నియోజక వర్గాల్లో అన్ని ఏర్పాటు జరుగుతున్నాయి. ఈ పాదయాత్రతో రాష్ట్రంలో ఎక్కడిక్కడ టీడీపీకి జవసత్వాలు నింపడంతో పాటు ఎక్కడిక్కడ స్థానిక నేతలలో ఆశావహులు, గెలుపు గుర్రాల లెక్కలు కూడా ఫైనల్ చేయనున్నట్లు తెలుస్తుంది.