Khammam: బీఆర్ఎస్ ధూంధామ్.. 2024 తర్వాత మోడీ ఇంటికే!

Kaburulu

Kaburulu Desk

January 18, 2023 | 09:00 PM

Khammam: బీఆర్ఎస్ ధూంధామ్.. 2024 తర్వాత మోడీ ఇంటికే!

Khammam: 2024 ఎన్నికల తర్వాత మోడీ ఇంటికి.. మేము ఢిల్లీకి అని.. సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఖమ్మంలో నిర్వహించిన బీఆర్ఎస్ భారీ బహిరంగ సభలో మాట్లాడిన సీఎం.. కాంగ్రెస్, బీజేపీలపై ఫైర్ అయ్యారు. ‘దేశంలో ఒక విచిత్రమైన పరిస్థితి నెలకొంది. ఒకటే ఒక మాట నా మనసును కలచివేస్తోంది. రాజకీయాల్లో ఎందరో గెలుస్తారు ఒడతారు. ఇవాళ మన దేశం లక్ష్యం ఏంటీ.. భారత్ తన లక్ష్యాన్ని కోల్పోయింది. బిత్తరపోయి గత్తర పడుతోంది. ఇది నా అంతరాత్మను కలచివేస్తోంది’ అని కేసీఆర్ ప్రసంగం ప్రారంభించారు.

బీజేపీ పెట్టుబడిదారి దోపిడీ దారి ప్రభుత్వమని మండిపడిన గులాబీ పార్టీ అధినేత.. దేశంలో ఎన్నో వనరులు ఉన్నాయని.. కానీ వాటిని వినియోగించుకునే తెలివి కేంద్రానికి లేదని ఆరోపించారు. ప్రధాని మోడీది ప్రైవేటైజేషన్ పాలసీ అని.. తమది మాత్రం నేషనలైజేషన్ పాలసీ అని తెలిపారు. అన్నీ ఉండి కూడా మనం ఎందుకు యాచకులం కావాలని కేసీఆర్ ప్రశ్నించారు. ఈ సభలో బీఆర్ఎస్ జాతీయ విధానం చెప్పడం సాధ్యంకాదని.. త్వరలోనే వాటిని ప్రకటిస్తామని కేసీఆర్ అన్నారు.

ఇక, సభ పుణ్యమా అని ఉమ్మడి ఖమ్మం జిల్లాపై సీఎం కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. గ్రామాలు, మున్సిపాలిటీలకు భారీగా నిధులను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించిన సీఎం.. జిల్లాలోని 589 గ్రామ పంచాయితీలకు ముఖ్యమంత్రి నిధి నుంచి రూ.10 లక్షల చొప్పున మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఖమ్మం మున్సిపాలిటీకి రూ. 50 కోట్లు, ఇతర మున్సిపాలిటీలకు రూ. 30కోట్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. సత్తుపల్లి, మధిర, వైరాలను సైతం ఖమ్మం మున్సిపాలిటీ తరహాలో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.

జేఎన్టీయూ ఆధ్వర్యంలో ఖమ్మంలో ప్రభుత్వ ఇంజనీరింగ్ ఏర్పాటు చేయనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. జిల్లాలోని ప్రతి జర్నలిస్టుకు నెల రోజుల్లో ఇళ్ల స్థలం కేటాయించాలని మంత్రులు హరీష్ రావు, పువ్వాడ అజయ్‌కు సూచించారు. మొత్తంగా ఈ సభలో కేసీఆర్ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను టార్గెట్ చేయగా.. సభకి హాజరైన మిగతా నేతలంతా కూడా బీజేపీని టార్గెట్ చేసి మాట్లాడారు. అయితే.. జాతీయ నేతల నోటి నుండి బీఆర్ఎస్ అనే మాట మాత్రం ఎక్కడా వినిపించకపోవడం విశేషం.