Ambati Rambabu: సీఎం అభ్యర్థి ఎవరో వారికే క్లారిటీ లేదు.. టీడీపీపై మంత్రి అంబటి కౌంటర్లు!

Kaburulu

Kaburulu Desk

January 29, 2023 | 03:23 PM

Ambati Rambabu: సీఎం అభ్యర్థి ఎవరో వారికే క్లారిటీ లేదు.. టీడీపీపై మంత్రి అంబటి కౌంటర్లు!

Ambati Rambabu: ఏపీలో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య విమర్శల యుద్ధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఒకవైపు టీడీపీ నుండి నారా లోకేష్ పాదయాత్ర మొదలు పెట్టి అధికార పార్టీని ఎండగడుతుంటే.. మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సీఎం నుండి మంత్రుల వరకు అందరినీ తూర్పారా పట్టేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీల ఆరోపణలను మంత్రులు, ఎమ్మెల్యేలు తిప్పికొట్టే పనిలో ఉన్నారు. మొత్తంగా మాటకి మాట అన్నట్లు రాజకీయం రసకందాయంగా సాగుతుంది.

నారా లోకేశ్ పాదయాత్రలో చేసిన వ్యమర్శలపై స్పందించిన మంత్రి అంబటి రాంబాబు.. టీడీపీ నేతలపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అసలు టీడీపీలో, జనసేనలో.. ఉమ్మడిగా సీఎం అభ్యర్థి ఎవరనేది కూడా క్లారిటీ లేదని.. చంద్రబాబు, లోకేష్ లలో ఎవరు సీఎం అవుతారన్నది ఆ పార్టీ నేతలకే క్లారిటీ లేకపోగా.. పవన్ కళ్యాణ్ సీఎం అభ్యర్ధని జనసేన నేతలు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు.

ఇక లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర వెలవెలబోయిందన్న మంత్రి అంబటి.. లోకేష్‌ది యువగళం కాదు.. యువ గరళం అంటూ ఎద్దేవా చేశారు. లోకేశ్ చిత్తశుద్ధిలేని పాదయాత్ర చేస్తున్నారని.. లోకేశ్ ఎన్ని పాదయాత్రలు చేసినా నాయకుడు కాలేడని.. నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు లోకేశ్ లో లేవన్నారు. పాదయాత్రతో వచ్చినా.. వారాహితో వచ్చినా అంతా హాస్యమే తప్ప ప్రజలు పట్టించుకోవడం లేదని చెప్పారు. తన అర్హతలను ప్రశ్నిస్తున్నారని.. అసలు లోకేష్‌కు ఏ అర్హతా లేదని మండిపడ్డారు.

పాదయాత్ర చేసినంత మాత్రాన టీజీపీ అధికారంలోకి వస్తుందని భావించడం వారి అమాయకత్వానికి నిదర్శనంగా మారిందని ఎద్దేవా చేశారు. ముందస్తు ఎన్నికలు వస్తాయనే వార్తలపై స్పందించిన మంత్రి అంబటి.. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలకు అవకాశమే లేదని స్పష్టం చేశారు. ముందస్తు పేరుతో ప్రతిపక్షాలు వారి పార్టీలో సీట్ల కోసం నాయకులను నిద్రలేపే ప్రయత్నమే ముందస్తు ఎన్నికల ప్రచారమని.. ఎంతమంది కలిసి పోటీ చేసినా వైసీపీ విజయాన్ని అడ్డుకోలేరని ధీమా వ్యక్తం చేశారు.