Vijayawada Politics: జగ్గయ్యపేట టీడీపీ అభ్యర్థిగా వైసీపీ ఎమ్మెల్యే?

Kaburulu

Kaburulu Desk

January 19, 2023 | 11:20 PM

Vijayawada Politics: జగ్గయ్యపేట టీడీపీ అభ్యర్థిగా వైసీపీ ఎమ్మెల్యే?

Vijayawada Politics: బెజవాడ రాజకీయాలలో కీలక మార్పులు జరగనున్నాయా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. ఒకపక్క కేశినేని బ్రదర్స్ ఒకరిపై ఒకరు బహిరంగ విమర్శలకు దిగుతుంటే మైలవరం నుండి ఊహించని రాజకీయాలు తెరపైకి వస్తున్నాయి. మైలవరం నుండి వయా జగ్గయ్యపేట మీదగా విజయవాడ వరకు తెలుగు దేశం పార్టీలో రాజకీయ ప్రకంపనలు చోటుచేసుకుంటున్నాయి. మిగతా రాష్ట్రం మొత్తం ఇంకా సమయం ఉంది కదా అని వేచి చూసే ధోరణిలో కనిపిస్తున్నా.. కృష్ణాజిల్లాలో మాత్రం రాజకీయం ఓ రేంజిలో మొదలైంది.

ఎన్నికలకు ఇంకా ఒకటిన్నర ఏడాది సమయం ఉన్నా.. ఏపీలో ముఖ్యంగా కృష్ణాజిల్లాలో రాజకీయం మాత్రం వేడెక్కుతోంది. వైసీపీ-టీడీపీ, వైసీపీ-జనసేన హోరాహోరీగా తలపడుతున్నాయి. సమయం దగ్గర పడేకొద్దీ వైసీపీలో అసమ్మతి ఎమ్మెల్యేలు కూడా నెమ్మదిగా తమ గళం విప్పుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి బహిరంగంగానే విమర్శలకు దిగగా ఆయన్ని పార్టీ పదవి నుండి తప్పించి కాస్త భయం కలిగేలా చేశారు. కానీ, ఇటీవలే మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ అసమ్మతి జాబితాలో చేరారు.

ఒకవైపు సొంత పార్టీని, అధ్యక్షుడిని విమర్శలు చేస్తున్న వసంత కృష్ణ ప్రసాద్.. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబును ఎప్పుడూ విమర్శించలేదని, కేవలం దేవినేని ఉమను, లేదంటే ఇతర టీడీపీ నాయకులను మాత్రమే విమర్శించానని చెప్తున్నారు. ఈ పరిణామాలన్నీ బేరీజు వేస్తున్న రాజకీయ విశ్లేషకులు వచ్చే ఎన్నికల్లో వసంత కృష్ణప్రసాద్ టీడీపీ తరఫున టికెట్ ఆశిస్తున్నట్లు అంచనాలు మొదలు పెట్టారు. దీంతో ఆయన నియోజకవర్గం మైలవరంలో ఏం జరగనుందని కొందరు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఈ క్రమంలోనే వసంత కృష్ణ ప్రసాద్ మైలవరం నియోజకవర్గం నుంచి పోటీ చేయనుండగా.. మైలవరం నుంచి టీడీపీ తరఫున పోటీచేయాల్సిన మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును నూజివీడు పంపనున్నట్లు స్థానిక నేతల నుండి వినిపిస్తుంది. అది కూడా కుదరకపోతే వసంతను జగ్గయ్యపేట నుంచి కూడా పోటీచేయించాలనే ఆలోచనలో కూడా టీడీపీ ఉన్నట్లు తెలుస్తుంది. జగ్గయ్యపేటలో ఉన్న శ్రీరాం తాతయ్యకు ఎమ్మెల్సీ హామీ ఇచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇందుకు ఎంపీ కేశినేని అండా దండా పుష్కలంగా ఉండగా.. అధిష్టానానికి ఇప్పుడు చావా రేవా అన్నట్లుగా కనిపిస్తుంది.