Petrol Price: దేశంలో పెట్రోల్ ధరలు తగ్గుతాయా? కేంద్ర మంత్రి ఏం చెప్పారంటే?

Kaburulu

Kaburulu Desk

January 23, 2023 | 09:03 AM

Petrol Price: దేశంలో పెట్రోల్ ధరలు తగ్గుతాయా? కేంద్ర మంత్రి ఏం చెప్పారంటే?

Petrol Price: దేశంలో ఇదీ అదీ అని లేదు.. ఏ వస్తువు ధర చూసినా భగ్గుమంటున్నాయి. కూరగాయల నుంచి కిరాణా సరుకుల వరకు ఏది ముట్టుకున్నా సామాన్యుడి గూబ గుయ్యిమనేలా ఉంది ధరల పరిస్థితి. ఇక, పెట్రోల్ పరిస్థితి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎప్పుడో సెంచరీ దాటేసిన పెట్రోల్ ఇంకా ఇంకా పైకి ఎగబాకుతూనే ఉంది.

పెట్రోల్ ధర వంద ఎప్పుడు దాటేసిందో.. నేనున్నా అంటూ వెనకే గ్యాస్ సిలిండర్ ధర కూడా వెయ్యి రూపాయల పైకి ఎగబాకింది. పూలు, పండ్ల నుండి ధాన్యం వరకు అన్ని ధరలు పెట్రోల్ మీదనే ఆధారపడి ఉండే సంగతి తెలిసిందే. పెట్రోల్ పెరిగితే రవాణా ఖర్చులు పెరుగుతాయి. రవాణా ఖర్చులు పెరిగితే వస్తువుల ధరలు పెరుగుతాయి. అలా అన్ని ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. దీంతో సామాన్యుడు ఏం కొనే పరిస్థితి కనిపించడం లేదు.

అయితే, వాహనదారులకు, సామాన్యులకు తాజాగా కేంద్ర పెట్రోలియం శాఖ ఓ గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలో పెట్రోల్‌ ధరలు తగ్గుతాయన్న ఆశాభావాన్ని పెట్రోలియం శాఖ మంత్రి హర్‌దీప్‌ సింగ్‌ పురి వ్యక్తం చేశారు. గతంలో పెట్రోల్‌ విక్రయంపై ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు నష్టాలను చూడగా, అంతర్జాతీయంగా తగ్గిన ధరలతో అవి ఇప్పుడు లాభాలను చూస్తున్నాయి. అదే సమయంలో డీజిల్‌పై అవి ఇప్పటికీ కూడా నష్టపోతున్నాయి.

అప్పుడు అంతర్జాతీయంగా ధరలు పెరిగినప్పటికీ, దేశీయ వినియోగదారులపై ఆ భారాన్ని మోపకుండా ఆయిల్‌ కంపెనీలు బాధ్యతాయుత కార్పొరేట్‌ సంస్థలుగా వ్యవహరించాయని మంత్రి పేర్కొన్నారు. అంతర్జాతీయంగా ధరలు తగ్గినా.. గడిచిన ఏడాదికి పైగా పెట్రోలియం కంపెనీలు రేట్లను మాత్రం సవరించడం లేదు. అయితే ఈ నష్టాలు ఇప్పుడు ముగింపు దశకు వచ్చాయి. ఈ నష్టాలు రికవరీ కాగానే పెట్రోల్, డీజిల్‌ విక్రయ ధరలు తగ్గుతాయని మంత్రి హరిదీప్ సింగ్ పూరి తెలిపారు.