Earthquake: పాకిస్తాన్, ఆఫ్గనిస్తాన్ లో భారీ భూకంపం.. ఢిల్లీ సహా ఉత్తర భారత దేశంలో కూడా ప్రకంపనలు!

Kaburulu

Kaburulu Desk

March 22, 2023 | 08:53 AM

Earthquake: పాకిస్తాన్, ఆఫ్గనిస్తాన్ లో భారీ భూకంపం.. ఢిల్లీ సహా ఉత్తర భారత దేశంలో కూడా ప్రకంపనలు!

Earthquake: పాకిస్తాన్, ఆఫ్గనిస్తాన్ దేశాలలో భారీ భూకంపం సంభవించింది. వెంట వెంటనే రెండు దేశాలలో భారీ భూకంపం సంభ‌వించచడంతో స్థానిక ప్రజలు హడలెత్తిపోయారు. రిక్ట‌ర్ స్కేలుపై 6.6 తీవ్ర‌త‌గా న‌మోదైన‌ట్లు సిస్మోల‌జీ అధికారులు పేర్కొన్నారు. ఈ భూకంపం ధాటికి ప‌లు భ‌వ‌నాలు ధ్వంసం అయ్యాయి. భూకంపం సంభ‌వించ‌డంతో ప్ర‌జ‌లు ఇళ్ల నుండి ప‌రుగులు తీశారు. కాగా, ఫైజాబాద్‌కు 133 కిమీ దూరంలో భూకంప కేంద్రం ఉన్న‌ట్లుగా నేష‌న‌ల్ సెంట‌ర్ ఫ‌ర్ సిస్మోల‌జీ గుర్తించింది.

ఆఫ్ఘ‌నిస్తాన్‌లో భూకంపం సంభ‌వించిన కొద్ది సేప‌టికే పాక్‌లోనూ భూప్ర‌కంప‌న‌లు వ‌చ్చాయి. రిక్ట‌ర్ స్కేలుపై 6.8గా న‌మోదైంది. పాకిస్తాన్ లోని ఇస్లామాబాద్, లాహోర్, పెషావర్ ప్రాంతాల్లో బలమైన ప్రకంపనలు సంభవించగా.. భూకంప తీవ్రతకు పలు భవనాలు బీటలు వారాయి. ఇంటి పైకప్పులు కూడా ధ్వంసమయ్యాయి. ఇస్లామాబాద్, లాహోర్, పెషావర్, రావల్పిండి, కేత్వా, కోహట్టతోపాటు పలు ప్రాంతాల్లో భూప్రకంపనలు సంభవించాయి. ఖైబర్ ఫఖ్తూంఖ్వా, పంజాబ్ లోనూ హైఅలర్ట్ ప్రకటించారు.

భూకంపం కారణంగా ఇప్పటి వరకు పాకిస్థాన్లో 9 మంది చనిపోగా 120 మందికి పైగా గాయపడ్డారని అధికారిక సమాచారం. ఖైబర్ పఖ్తున్ఖ్వా విపత్తు నిర్వహణ అథారిటీ నివేదిక ప్రకారం.. ప్రావిన్స్‌ లో ఇంటి పైకప్పు, గోడ, ఇల్లు కూలిపోయిన సంఘటనలలో కనీసం ఇద్దరు మరణించారు. ఆరుగురు వ్యక్తులు గాయపడ్డారు. భూకంపం కారణంగా ఇక్కడ ఎనిమిది ఇళ్లు దెబ్బతిన్నా యి. అదే సమయంలో స్వాత్ జిల్లా పోలీసు అధికారి షఫివుల్లా గండాపూర్ మీడియాతో మాట్లాడుతూ.. జిల్లాలో ఇద్దరు వ్య క్తులు మరణించారని, 150 మంది గాయపడ్డారని చెప్పారు.

పాకిస్తాన్, ఆఫ్గనిస్తాన్, చైనాలలో భూకంపం కారణంగా భారత్లోని ఉత్తరాది రాష్ట్రాల్లోనూ భూప్రకంపనలు సంభవించాయి. ఢిల్లీ, జమ్ము కశ్మీర్, హరియాణా, పంజాబ్, రాజస్థాన్ లో భూమి కంపించింది. రిక్టర్ స్కేల్ పై 6.6 తీవ్రత నమోదైంది. ప్రకంపనల ధాటికి భయాందోళనలకు గురైన ప్రజలు ఇళ్ల నుంచి పరుగులు తీశారు. భూకంప ప్రభావానికి జమ్మూలో పలు చోట్ల ఇంటర్నెట్ కు అంతరాయం కలిగింది. అయితే ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు.