Coronavirus Cases in India: విస్తరిస్తున్న కరోనా.. దేశంలో కొత్తగా మూడువేల పైచిలుకు కరోనా కేసులు

Kaburulu

Kaburulu Desk

March 31, 2023 | 01:30 PM

Coronavirus Cases in India: విస్తరిస్తున్న కరోనా.. దేశంలో కొత్తగా మూడువేల పైచిలుకు కరోనా కేసులు

Coronavirus Cases in India: దేశంలో మళ్ళీ కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కేసుల పెరుగుదలపై అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేస్తున్నా కేసుల సంఖ్య మాత్రం ఆగడం లేదు. రోజురోజుకూ కొత్త కేసుల్లో భారీ పెరుగుదల కనిపిస్తోంది. తాజాగా కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం 24 గంటల వ్యవధిలో కొత్త కేసులు మూడు వేలకు పైనే నమోదయ్యాయి.

బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు 1,10,522 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, 3,016 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. దాదాపు ఆరు నెలల తరువాత ఈ స్థాయిలో కొత్త కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి. గత ఏడాది అక్టోబర్ 2 న 3,375 కేసులు నమోదైనట్టు అధికారులు తెలిపారు. తాజా కేసులతో మొత్తం కరోనా బారిన పడిన వారి సంఖ్య 4,47,12,692 కి చేరింది. కాగా బుధవారంతో పోలిస్తే బుధవారం 2151 కేసులు నమోదు కాగా, కొత్త కేసుల్లో 40 శాతం పెరుగుదల కనిపిస్తోంది.

ప్రస్తుతం దేశంలో 13,509 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు 4,41,68,321మంది కోలుకున్నారు. బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు 24 గంటల వ్యవధిలో 14 మంది మృతి చెందారు. మహారాష్ట్రలో ముగ్గురు, ఢిల్లీలో ఇద్దరు, హిమాచల్ ప్రదేశ్‌లో ఒకరు, కేరళలో ఎనిమిది మంది చనిపోయారు. దీంతో దేశంలోమొత్తం మరణాల సంఖ్య 5,30,862 గా నమోదైంది. ఇప్పటివరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల్లో 0.03 శాతం యాక్టివ్‌గా ఉన్నాయని కేంద్ర వైద్యారోగ్యశాఖ అధికారులు తెలిపారు.

రికవరీ రేటు 98.78 శాతంగా, మరణాలు 1.19 శాతంగా ఉన్నాయని పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా ఇప్పటివరకు 220.65 కోట్ల వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేశామని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఉత్తరప్రదేశ్ నుంచి ఢిల్లీ, మహారాష్ట్ర వరకూ ఉన్న ఆసుపత్రులు హైఅలర్ట్‌లో ఉండాలంటూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇక ప్రస్తుతం కరోనా వ్యాప్తికి ఎక్స్‌‌బీబీ వేరియంట్ కారణమని ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి పేర్కొన్నారు. అయితే, కొత్త వేరియంట్ ఏదీ వెలుగులోకి రాలేదని ఆయన భరోసా ఇచ్చారు.