Ramesh Jarkiholi: వాళ్ళు రూ.3 వేలు ఇస్తాం.. మేం రూ.6 వేలు ఇస్తాం.. బీజేపీ ఎమ్మెల్యే సంచలన ప్రకటన!

Kaburulu

Kaburulu Desk

January 23, 2023 | 08:35 AM

Ramesh Jarkiholi: వాళ్ళు రూ.3 వేలు ఇస్తాం.. మేం రూ.6 వేలు ఇస్తాం.. బీజేపీ ఎమ్మెల్యే సంచలన ప్రకటన!

Ramesh Jarkiholi: అవతలి పార్టీ వాళ్ళ మీద ఒక్క రూపాయి అయినా ఎక్కువ ఖర్చు పెట్టి అయినా ఈసారి ఎన్నికలలో గెలవాలి. ఎంత ఖర్చైనా పర్లేదు.. ఓటుకు ఎంత ఇచ్చి అయినా గెలవాల్సిందే. ఇదీ ఎన్నికల సమయాలలో రాజకీయ పార్టీల పరిస్థితి. రూ.500 నుండి అవసరమైతే రూ.10000 ఖర్చు పెట్టైనా సరే మీ ఓటు నాకే వేయాలని వాగ్దానాలు తీసుకుంటుంటారు. ప్రజలు కూడా దీనికి అలవాటు పడిపోయి ఎన్నికలు అనగానే ఎంతిస్తారు? అని చేయి చాపుతున్నారు.

అయితే.. ఈ ఓటుకు నోటు వ్యవహారం అంతా దొంగచాటుగానే జరిగిపోతుంది. కానీ, ఓ బీజేపీ మాజీ మంత్రి, ఎమ్మెల్యే ఓటుకు ఎంత ఇస్తారో బహిరంగంగా చెప్పేశారు. అంతేకాదు, ఈసారి ఎన్నికలలో తమ అభ్యర్థికి రూ.6 వేలు ఇస్తేనే వేయండి అంటూ వ్యాఖ్యలు చేశారు. అవతలి పార్టీ వాళ్ళు రూ.3 వేలు ఇస్తున్నారని.. తమ పార్టీ క్యాండిడేట్ రూ.6 వేలకు తగ్గకుండా ఇస్తాడని సంచలన వ్యాఖ్యలు చేశారు.

మరికొద్ది రోజులలో కర్ణాటకలో ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా బెళగావిలోని సులేబావిలో బీజేపీ నేతలు ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీనికి హాజరైన మాజీ మంత్రి రమేశ్ జార్కిహోళి మాట్లాడుతూ.. నియోజకవర్గంలో ప్రత్యర్థి పార్టీ అభ్యర్థి టిఫిన్ బాక్సులు, కుక్కర్లు కొని ఓటర్లకు పంచుతున్నారని, వాటి విలువ మహా అయితే రూ. 3 వేలు ఉంటుందని, తమ అభ్యర్థి కనుక ఓటుకు రూ. 6 వేలు ఇవ్వకుంటే ఓటెయ్యెద్దని అభ్యర్థిస్తున్నానని అన్నారు.

ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు అక్కడే దుమారం రేపగా.. రాజకీయ వర్గాలలో వివాదస్పదంగా మారాయి. లైంగిక కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న రమేష్ జార్కి హోళి 2021లో మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. అయినా.. ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో ఉంటూనే ఉంటారు. రమేష్ చేసిన ఈ వ్యాఖ్యలను నీటిపారుదల శాఖ మంత్రి గోవింద్ కర్జోల్ తీవ్రంగా ఖండించారు. ఇలాంటి వాటికి తమ పార్టీలో చోటు లేదన్నారు.

బీజేపీ ఓ భావజాలంపై నిర్మితమైన పార్టీ అని.. అందుకనే అది రెండోసారి కూడా పూర్తి మెజారిటీతో దేశంలో అధికారంలోకి వచ్చిందని, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లోనూ తాము పూర్తి మెజారిటీతో అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. రమేశ్ జార్కిహోళి చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని, పార్టీకి సంబంధం లేదని స్పష్టం చేశారు. మరోవైపు, కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రియాంక్ ఖర్గే.. రమేష్ వ్యాఖ్యలు బీజేపీ అవినీతికి ఇది అద్దం పడుతోందని, ఎన్నికల సంఘం ఆయన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.