Raja Singh: ఎమ్మెల్యే రాజాసింగ్‌కు మరోసారి నోటీసులు.. అసలేం జరిగిందంటే?

Kaburulu

Kaburulu Desk

January 20, 2023 | 01:31 PM

Raja Singh: ఎమ్మెల్యే రాజాసింగ్‌కు మరోసారి నోటీసులు.. అసలేం జరిగిందంటే?

Raja Singh: హైదరాబాద్ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు పోలీసులు మరోసారి నోటీసులు జారీచేశారు. తరచుగా వివాదాస్పద వ్యాఖ్యలు, వివాద అంశాలలో జోక్యం చేసుకొనే రాజాసింగ్ కు 41ఏ సీఆర్పీసీ కింద మంగళ్‌హాట్‌ పోలీసులు నోటీసులు అందించారు. ఎమ్మెల్యే అజ్మీర్‌ దర్గాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని.. గతేడాది ఆగస్టులో కంచన్‌బాగ్‌ పోలీస్‌స్టేషన్‌లో రాజాసింగ్‌పై కేసు నమోదు అయింది.

ఈ కేసు కంచన్‌బాగ్‌ నుంచి మంగళ్‌హాట్‌ పోలీస్‌స్టేషన్‌కు పోలీసులు బదిలీ అయింది. ఈ నేపథ్యంలోనే మంగళ్‌హాట్‌ పోలీసులు ఆయనకు తాజాగా నోటీసులు ఇచ్చారు. అజ్మీర్ దర్గాపై అనుచిత వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని పోలీసులు నోటీసులో కోరారు. ఈ నోటీసులపై రాజాసింగ్ తరపు న్యాయవాది కరుణ సాగర్ స్పందించగా.. పోలీసులు జారీ చేసిన నోటీసులకు సమాధానం ఇస్తామన్నారు.

కాగా, రాజాసింగ్ ఫేస్ బుక్ లో నెటిజన్ పెట్టిన ఓ పోస్టు కింద కామెంట్ మాత్రమే చేశారని రాజాసింగ్ తరపు న్యాయవాది కరుణ సాగర్ చెప్తున్నారు. అయితే ఆయన చేసిన కామెంట్ ఓ మతాన్ని కించపరిచినట్లుగా ఉందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. గతంలోనూ రాజాసింగ్ పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేయగా ఆయనపై పలు కేసులు కూడా నమోదయ్యాయి. మహ్మద్‌ ప్రవక్తపై రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ పోలీసులు పీడీ యాక్ట్‌ కింద కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేశారు.

రాజాసింగ్ అరెస్టు వ్యతిరేకిస్తూ ఆయన భార్య హైకోర్టులో పిటిషన్ వేయగా.. హైకోర్టు ఆయనపై పీడీ యాక్ట్‌ను క్వాష్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో పలు షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేశారు. మీడియాతో మాట్లాడటం, ర్యాలీల్లో పాల్గొనడం.. రెచ్చగొట్టే ప్రసంగాలు చేయకూడదని స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టవద్దని హైకోర్టు షరతు విధించింది. కానీ.. అనూహ్యంగా ఇలా పోస్టుకు కింద పెట్టిన కామెంట్ కు కూడా పోలీసులు నోటీసులు ఇచ్చారు.