BJP MLA Rajasing: నిన్ను చంపేస్తాం.. పాకిస్తాన్ నుండి బీజేపీ ఎమ్మెల్యేకు బెదిరింపు కాల్స్!

Kaburulu

Kaburulu Desk

February 20, 2023 | 11:18 PM

BJP MLA Rajasing: నిన్ను చంపేస్తాం.. పాకిస్తాన్ నుండి బీజేపీ ఎమ్మెల్యేకు బెదిరింపు కాల్స్!

BJP MLA Rajasing: పాకిస్తాన్ నుండి తనను చంపేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తులు పలుమార్లు ఫోన్ చేసి బెదిరిస్తున్నారని బీజేపీ రాష్ట్ర గోరక్షా కన్వీనర్, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ లోథ్ అన్నారు. ఆయన ట్విట్టర్ ద్వారా ఈ విషయం వెల్లడించారు. ‘నన్ను చంపుతామంటూ బెదిరింపు కాల్స్‌ వస్తున్నాయి. ఇవాళ మధ్యాహ్నం 3.34 గంటలకు బెదిరింపు కాల్‌ వచ్చింది. పాకిస్తాన్ కు చెందిన ఒక మొబైల్ వాట్సాప్‌ కాల్‌ ద్వారా చంపుతామంటున్నారని ట్వీట్ చేశారు.

తమ స్లీపర్‌ సెల్స్‌ యాక్టివ్‌గా ఉన్నాయని వారు బెదిరించారని.. ప్రతిరోజు ఇలాంటి బెదిరింపు కాల్స్‌ వస్తూనే ఉన్నాయని ఎమ్మెల్యే రాజాసింగ్ ట్వీట్ చేశారు. రాజా సింగ్‌ ఈ ట్వీట్‌ను కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, తెలంగాణ డీజీపీ, హైదరాబాద్‌ సీపీలకు కూడా ట్యాగ్‌ చేశారు. ఓ పాకిస్థానీ నుంచి సోమవారం మధ్యాహ్నం 3.34 గంటలకు తనకు వాట్సాప్ కాల్ వచ్చిందని రాజాసింగ్ వెల్లడించారు. తనకు కాల్ చేసిన వ్యక్తి వద్ద తన కుటుంబ వివరాలన్నీ ఉన్నాయంటూ రాజాసింగ్ పేర్కొన్నారు.

గతంలో కూడా రాజా సింగ్‌కు ఇలాంటి బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఆయనకు ప్రభుత్వం అప్పట్లో భద్రత కూడా పెంచింది. అప్పట్లో మంగళ్ హాట్ పోలీసులకు ఫోన్ రికార్డింగులు సహా ఫిర్యాదు చేశానని, నగర పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డిని పలుమార్లు ఫోన్ ద్వారా సంప్రదించానని, స్పందన రాలేదని రాజాసింగ్ ఆరోపించారు. కాగా, ఇప్పుడు మళ్ళీ బెదిరింపులకు పాల్పడుతున్నారని రాజాసింగ్ వెల్లడించారు. మరి దీనిపై కేంద్ర హోంశాఖ కానీ, రాష్ట్ర పోలీసులు కానీ స్పందిస్తారా లేదా అన్నది చూడాల్సి ఉంది.