M.K.Stalin: స్టాలిన్ దేశానికి ప్రధాని ఎందుకు కాకూడదు.. జమ్మూకాశ్మీర్ మాజీ సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు!

Kaburulu

Kaburulu Desk

March 2, 2023 | 08:40 AM

M.K.Stalin: స్టాలిన్ దేశానికి ప్రధాని ఎందుకు కాకూడదు.. జమ్మూకాశ్మీర్ మాజీ సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు!

M.K.Stalin: తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌ కు.. జమ్ముకశ్మీర్‌ మాజీ సీఎం నేషనల్ కాన్ఫరెన్స్ (NC) అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా మద్దతిచ్చారు. ఆయన ఎందుకు ప్రధానమంత్రి కాకూడదు?, అందులో తప్పేముంది? అని ప్రశ్నించారు. దేశ ఐక్యతను కాపాడేందుకు స్టాలిన్ కృషి చేస్తున్నారని.. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశాన్ని ఐక్యంగా ఉంచేందుకు ఎంతో పాటుపడుతున్నారని కితాబునిచ్చారు.

చెన్నైలో జరిగిన సీఎం స్టాలిన్‌ 70వ పుట్టిన రోజు వేడుకల్లో ఫరూక్‌ అబ్దుల్లా హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి ప్రతిపక్షం కోసం అధికార డీఎంకే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ అంటేనే భిన్నత్వంలో ఏకత్వమని.. దాని కోసం స్టాలిన్ ఎంతో కృషి చేస్తున్నారని కొనియాడారు.

రానున్న 2024 లోక్‌సభ ఎన్నికల్లో నరేంద్ర మోడీకి సవాల్‌ విసిరే ప్రతిపక్షాల ఉమ్మడి ప్రధాని అభ్యర్థి గురించి మీడియా అడిగిన ప్రశ్నకు ఫరూక్‌ అబ్దుల్లా ఆసక్తికర సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌కు మద్దతు తెలిపారు. ఆయన ఎందుకు పీఎం కాకూడదు? అందులో తప్పేముందని ప్రశ్నించారు. ప్రధాని అయ్యేందుకు స్టాలిన్‌కు అన్ని అర్హతలున్నాయని ఫరూక్‌ అబ్దుల్లా ప్రశంసించారు. 2024 నాటికి ఇతర నాయకులు కూడా అదే విధంగా ఆలోచిస్తారని నేను భావిస్తున్నానని కూడా చెప్పారు.

మరోవైపు సొంతగడ్డపై స్టాలిన్ జాగ్రత్తగా పావులు కదుపుతున్నారు. తమిళనాడు, పాండిచ్చేరిలో డీఎంకేను తిరుగులేని శక్తిగా నిలపాలని వ్యూహాలు రచిస్తున్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల నాటికి తమిళనాడు, పాండిచ్చేరిలో పూర్తి స్థాయి ఆధిక్యం కనపరచాలని యోచిస్తున్న ఆయన.. కాంగ్రెస్ పార్టీతో ఉన్న పొత్తును కొనసాగిస్తూనే మిగతా ప్రాంతీయ తమిళ పార్టీలతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఇటీవలే రాజీనామా చేసిన యువ ఐపీఎస్ అధికారి అన్నామలై ఇక్కడ బీజేపీని పరుగులు పెట్టిస్తున్నారు.

తాజాగా ఓ జవాన్‌ను డీఎంకే కౌన్సిలర్ కొట్టి చంపడంపై అన్నామలై పెద్ద స్థాయిలో ఉద్యమిస్తున్నారు. గవర్నర్‌ను కలవడంతో పాటు మాజీ సైనికులను, మేధావులను, భావ సారూప్యత కలిగిన వ్యక్తులను కలుపుకుని పోతున్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల నాటికి అన్నామలై బలమైన నేతగా అవతరిస్తే అన్నాడీఎంకేతో పాటు మరికొన్ని పార్టీలు కూడా కూటమిలో చేరే అవకాశాలు కనిపిస్తున్నందున.. స్టాలిన్ అంతకుమించి ఆలోచిస్తూ దేశంలో మిత్రపక్షాల మద్దతు కూడగట్టుకుంటున్నారు.