PM Telangana Tour: మరోసారి తెలంగాణకు ప్రధాని రాకకు సన్నాహాలు.. ఏప్రిల్ 8న ఖరారయ్యే ఛాన్స్!

PM Telangana Tour: ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్ర పర్యటన పలుమార్లు వాయిదా పడుతూ వస్తున్న సంగతి తెలిసిందే. గతంలో అధికార పర్యటలను జరగాల్సి ఉన్నా వివిధ కార్యక్రమాల కారణంగా హాజరుకాలేకపోయారు. కాగా, వచ్చేనెల 8వ తేదీన ప్రధాని మోడీ రాష్ట్రానికి రానున్నట్లు తెలుస్తోంది. రెండు మూడు రోజుల్లో అధికారికంగా ఖరారయ్యే అవకాశం ఉంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను అధునాతన స్థాయిలో, అంతర్జాతీయ ప్రమాణాలతో పునరుద్దరించనున్నారు. దీనికి సంబంధించి ప్రధాని మోడీ శంకుస్థాపన చేయనున్నారు.
ఈ కార్యక్రమంతో పాటు సికింద్రాబాద్ తిరుపతి మధ్య వందేభారత్ రైలును ప్రారంభించనున్నారు. ఈ రెండు కార్యక్రమాలతో పాటు రాష్ట్రంలో పలు అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. ఈమేరకు క్షేత్రస్థాయిలో పరిస్థితులపై ఇప్పటికే ప్రధానమంత్రి కార్యాలయం ఆరా తీసింది. ఇదే క్రమంలో బీజేపీ శ్రేణులు ఏర్పాటు చేసే బహిరంగ సభలోనూ మోదీ ప్రసంగించనున్నారు.
ఈసారి ఖచ్చితంగా హైదరాబాద్ నగరానికి ప్రధాని మోడీ వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారిక వర్గాలు చెబుతున్నాయి. అధికారికంగా పర్యటన ఖరారైన వెంటనే ప్రధాని మోడీ పర్యటనకు సంబంధించి భద్రతా ఏర్పాట్లను అధికారులు చేపట్టనున్నారు. ఈ ఏడాది తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మోడీ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందే పలు అభివృద్ది కార్యక్రమాలను చేపట్టాలని బీజేపీ ప్లాన్ గా కనిపిస్తుంది.
తెలంగాణలో రానున్న అసెంబ్లీ ఎన్నికలను బీజేపీ సీరియస్ గా తీసుకుంది. బీఆర్ఎస్ ను ఓడిస్తామని చెబుతోంది. తెలంగాణ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న బీజేపీ అధినాయకత్వం ప్రతీ నెల ముఖ్య నేతల పర్యటనలు ఉండేలా కార్యాచరణ అమలు చేస్తోంది. అందులో భాగంగా ఏప్రిల్ 8న ప్రధాని మోడీ హైదరాబాద్ పర్యటనకు సూత్రప్రాయంగా ఆమోదం లభించినట్లు తెలుస్తోంది. ముందుగా ప్రధాని సభ ద్వారా ప్రజల్లోకి వెళ్లాలనేది బీజేపీ నేతల వ్యూహంగా కనిపిస్తుంది. ఇదే జరిగితే ఎన్నికల వేడి మరికాస్త తీవ్రం కావడం ఖాయంగా చెప్పుకోవచ్చు.