Amit Shah: కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన ఖరారు.. ఎప్పుడంటే?

Kaburulu

Kaburulu Desk

February 24, 2023 | 09:45 PM

Amit Shah: కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన ఖరారు.. ఎప్పుడంటే?

Amit Shah: తెలంగాణలో రాజకీయాలు వాడీ వేడిగా సాగుతున్నాయి. ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండడంతో అధికార, ప్రతిపక్షాలు మాటల తూటాలు వదులుతున్నారు. ఏదొక యాత్రల పేరున ప్రజల మధ్యకి వెళ్లి సవాళ్లు, ప్రతిసవాళ్ళతో కాకరేపుతున్నారు. జాతీయ పార్టీలైతే.. అధిష్టానం నుండి నేతలను రప్పించి కార్యకర్తలలో మరికాస్త జోష్ పెంచేందుకు కూడా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఈక్రమంలోనే తెలంగాణ బీజేపీ నేతలు జాతీయ నాయకుల కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

హోంమంత్రి అమిత్ షా ఒకటీ, రెండుసార్లు రాష్ట్రానికి రాగా.. ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటనకి వస్తారని ఒకటికి రెండుసార్లు షెడ్యూల్ కూడా సిద్ధం చేసినా అనివార్య కారణాలతో రద్దయ్యాయి. మోడీ కాకపోయినా హోమ్ మంత్రి, జాతీయ పార్టీకి కర్త, క్రియ అయిన అమిత్ షా మరోసారి రాష్ట్రానికి వస్తే పార్టీలో జోష్ పెరుగుతుందని బీజేపీ రాష్ట్ర నేతలు ఆశగా ఎదురుచూస్తున్నారు. మొత్తానికి వారి ఆశ ఫలించింది. మార్చిలో అమిత్ షా మరోసారి తెలంగాణ పర్యటనకు రాబోతున్నారు.

అమిత్ షా మార్చి 12న తెలంగాణలో పర్యటించనున్నారు. అధికారిక కార్యక్రమాల్లో భాగంగా అమిత్ షా హైదరాబాద్ కు వస్తున్నట్లు బిజేపీ నేతలు తెలిపారు. అదే రోజు రాష్ట్రంలో ఏదో ఒక పార్లమెంట్ నియోజకవర్గంలో బహిరంగ సభ ఏర్పాటు చేయాలనే ఆలోచనలో స్టేట్ బీజేపీ నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. ఆదిలాబాద్ లేదా మహబూబ్‌నగర్ పార్లమెంట్‌లో ఏదో ఒక నియోజకవర్గంలో సభ ఏర్పాటు చేయనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసే దిశగా అమిత్ షా పర్యటన సాగనుంది. పనిలో పనిగా నియోజకవర్గాల్లోని పార్టీ నేతలతో కూడా అమిత్ షా సమావేశమై దిశానిర్దేశం చేయనున్నారట. ఈ పర్యటనలోనే వచ్చే ఎన్నికల్లో అమలుచేసే వ్యూహాల గురించి చర్చలు జరుగుతాయని.. తెలంగాణలో బీజేపీని మరింత బలోపేతం కోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలో చర్చలు సాగనున్నాయని తెలుస్తుంది.