Telangana BJP: బీజేపీ మిషన్-90 స్ట్రాటజీ.. అసెంబ్లీ బరిలో ఎంపీలు.. మాజీ ఎంపీలు

Kaburulu

Kaburulu Desk

February 3, 2023 | 01:51 PM

Telangana BJP: బీజేపీ మిషన్-90 స్ట్రాటజీ.. అసెంబ్లీ బరిలో ఎంపీలు.. మాజీ ఎంపీలు

Telangana BJP: బీజేపీ అంటేనే ఎలక్షన్ స్ట్రాటజీతోనే ఎదిగిన పార్టీగా పేరుంది. మోడీ-షా ద్వయం స్ట్రాటజీలతోనే దేశవ్యాప్తంగా బీజేపీకి వైభవాన్ని తీసుకొచ్చారు. తెలంగాణ విషయానికి వస్తే కనుక బలమైన ప్రతిపక్ష పార్టీగా పుంజుకుంది. అయితే.. బీఆర్ఎస్ ను ఓడించి సీఎం పీఠాన్ని దక్కించుకోగలదా అంటే అవునని చెప్పలేని పరిస్థితి. ఇప్పటి వరకు మెట్రో నగరాలతో పాటు పార్లమెంట్ స్థానాలలో బీజేపీ సత్తా చాటినా అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ ను ఓడించే స్థాయి కనిపించడం లేదు.

అయితే.. ఈసారి ఎలాగైనా అసెంబ్లీ ఎన్నికలలో విజయాన్ని దక్కించుకొని తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరేయాలని ఉవ్విళ్లూరుతోంది. అందుకు తగ్గట్లే రకరకాల ఎత్తులను కూడా సిద్ధం చేస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా చాలా ప్రాంతాలలో బీజేపీకి అసెంబ్లీ ఎన్నికలలో బలమైన నాయకులు లేరు. అందుకే ఇప్పటికే కొన్ని చోట్ల ఇతర పార్టీల నేతలను ఆకర్షించి కాస్త బలం పుంజుకుంది. అయినప్పటికీ మరొకొన్ని ప్రాంతాలలో బలమైన నేతలుగా పేరున్న ఎంపీలను, మాజీ ఎంపీలను సైతం రంగంలోకి దింపాలని చూస్తున్నారట.

ప్రస్తుత బీజేపీ ఎంపీలుగా ఉన్న నలుగురుని అసెంబ్లీ స్థానాల్లో దించేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది. బీజేపీ ఎంపీలు కిషన్ రెడ్డి, బాపురావు, బండి సంజయ్‌లు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం గ్యారెంటీగా కనిపిస్తుంది. ఇక, ధర్మపురి అరవింద్ పోటీ పై క్లారిటీ లేదు కానీ.. మరో ఎంపీ రాజ్యసభ సభ్యుడు కే లక్ష్మణ్ కూడా అసెంబ్లీ బరిలో ఉంటారని చెప్తున్నారు. ఇదే సమయంలో మాజీ ఎంపీలు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, వివేక్, జితేందర్ రెడ్డిలు సైతం అసెంబ్లీ ఎన్నికల బరిలో ఉంటారని తెలుస్తోంది.

ఎలాగూ పార్లమెంట్ ఎన్నికల కంటే ముందే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా.. వీరందరినీ అసెంబ్లీ బరిలో దింపి గెలుపు గుర్రాలుగా మార్చాలని చూస్తున్నారట. మరోవైపు ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాలు వరసగా తెలంగాణ పర్యటనకు వచ్చి ఇతర పార్టీల నేతలను ఆకర్షించి అసెంబ్లీ ఎన్నికల సమయానికి బీఆర్ఎస్ ను ఢీ కొట్టే స్థాయికి ఎదగాలని చూస్తున్నట్లు తెలుస్తుంది.