TDP-BJP: నో ఛాన్స్.. టీడీపీతో మాకేం పని?.. తరుణ్ చుగ్ కీలక వ్యాఖ్యలు!

Kaburulu

Kaburulu Desk

January 13, 2023 | 02:40 PM

TDP-BJP: నో ఛాన్స్.. టీడీపీతో మాకేం పని?.. తరుణ్ చుగ్ కీలక వ్యాఖ్యలు!

TDP-BJP: ఏపీలో ఇప్పటికే జనసేన పార్టీతో దాదాపుగా పొత్తు ఖరారు చేసుకున్న టీడీపీ బీజేపీ విషయంలో మాత్రం ఇంకా కన్ఫ్యూజన్ కొనసాగుతూనే ఉంది. జనసేనతో పొత్తులో ఉన్న బీజేపీ.. టీడీపీకి మాత్రం దూరంగానే ఉన్నామని చెప్తుంది. అయితే.. టీడీపీ మాత్రం బీజేపీతో కలిసేందుకు సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తుంది. ఏపీతో పాటు తెలంగాణలో కూడా బీజేపీతో కలిసి వెళ్లేందుకు టీడీపీ సానుకూలంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది.

ఆ మధ్య ఖమ్మంలో భారీ సభ నిర్వహించిన టీడీపీ.. ఈ సభ ద్వారా బీజేపీకి సిగ్నల్ ఇచ్చినట్లుగా కనిపించింది. దీంతో బీజేపీ కూడా టీడీపీతో పొత్తుపై ఆలోచన చేస్తున్నట్లుగా ప్రచారం జరిగింది. అయితే.. ఒంటరిగానే పోటీ చేస్తామని తమకు ఎవరితో పొత్తు ఉండదని బీజేపీ నేతలు మాత్రం ఎప్పటికప్పుడు చెబుతూనే ఉన్నారు. ఈ అంశంపై తాజాగా బీజేపీ నేతలు మరోసారి క్లారిటీ ఇచ్చారు. ఎట్టి పరిస్తితులోనూ టీడీపీతో పొత్తు ఉండదని రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ క్లారిటీ ఇచ్చారు.

అయినా, బీజేపీ రాష్ట్ర ఇంచార్జ్ తరుణ్ చుగ్ టీడీపీతో పొత్తుకి సిద్ధంగా ఉన్నట్లు మరో ప్రచారం మొదలైంది. దీనిపై స్పందించిన తరుణ్ చుంగ్ టీడీపీతో పొత్తుపై కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీతో పొత్తు వార్తలను ఖండించిన తరుణ్ ఛుగ్.. తాను ఆ వ్యాఖ్యలు చేయలేదని స్పష్టం చేశారు. ఉనికిని కోల్పోయిన కొన్ని పార్టీలు అసత్య ప్రచారాలు చేస్తున్నాయన్న ఆయన రాష్ట్రంలో బీఆర్ఎస్ ను ఓడించే బలం బీజేపీకి ఉందని ఓ ప్రకటన విడుదల చేశారు.

అయితే ఒంటరి పోరు బీజేపీకి ఎంతవరకు లాభం చేకూరుస్తుంది అన్నది ఆసక్తిగా మారింది. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులను చూస్తే బీజేపీ బలం పెరుగుతున్న మాట వాస్తవమే. కానీ అది గెలిచేంత స్థాయికి వెళ్తుందా అన్నదే ప్రశ్నార్ధకం. ఇప్పటి వరకు ఉన్న సర్వేల ప్రకారం బీజేపీకి ఓ 30 లోపు సీట్లు మాత్రమే వచ్చే అవకాశాలు ఉండగా మ్యాజిక్ ఫిగర్‌ కి మరో 30 కావాలి. అలా అని టీడీపీ కలిసినా మరో 30 వస్తాయన్న ధీమా కూడా లేదు. కానీ.. టీడీపీ కలిస్తే మరికొన్ని స్థానాలలో గెలుపు ఓటములలో కలిసి వస్తుంది. కానీ.. ఇప్పటికైతే బీజేపీ ఆ ఆలోచన చేస్తున్నట్లుగా కనిపించడం లేదు.