Viral News: ఒకరు పాక్‌లో మరొకరు ఇండియాలో.. 75 ఏళ్ల తర్వాత కలిసిన అరుదైన క్షణాలు!

Kaburulu

Kaburulu Desk

March 4, 2023 | 08:30 PM

Viral News: ఒకరు పాక్‌లో మరొకరు ఇండియాలో.. 75 ఏళ్ల తర్వాత కలిసిన అరుదైన క్షణాలు!

Viral News: మనిషి జీవితంలో తల్లి దండ్రుల అనంతరం ఎక్కువ అనురాగం, ఆప్యాయత, ప్రేమ ఉండేది తోడపుట్టిన వారి మీదే. తోబుట్టువుల ఎడబాటు తట్టుకోలేనిది. ఒకవేళ దూరం కావాల్సి వస్తే వారిని ఎప్పుడు కలుస్తామా.. ఎప్పుడెప్పుడు మాట్లాడుతామా అని ఎదురుచూస్తుంటాం. అలాంటిది ఓ ఇద్దరు అన్నదమ్ములు ఏకంగా 74 సంవత్సరాలు విడిపోయారు. ఇన్నేళ్ల తర్వాత కలుసుకున్న ఆనందంలో సోదరులిద్దరూ ఎంతో భావోద్వేగానికి లోనయ్యారు. ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని కంటతడి పెట్టుకున్నారు.

హర్యానలోని మహేంద్రనగర్ జిల్లా, గోమ్లా గ్రామంలో గురుదేవ్ సింగ్, దయాసింగ్ లు నివసించేవారు. తండ్రి మరణంతో అన్నాదమ్ములు దేశ విభజన సమయంలో విడిపోయారు. విభజన సమయంలో గురుదేవ్ సింగ్ తండ్రి మిత్రుడైన కరీం భక్ష్ తో పాకిస్తాన్ కు వెళ్లిపోయాడు. అక్కడకి వెళ్ళాక గులామ్ ముహమ్మద్ గా మారిపోయాడు. గురుదేవ్ సింగ్ తమ్ముడు దయాసింగ్ మాత్రం మామతో కలిసి భారత్ లోనే ఉండిపోయాడు. అలా 75 ఏళ్ల క్రితం విడిపోయిన ఈ ఇద్దరు సోదరుల కుటుంబాలు సోషల్ మీడియా పుణ్యమా 75 ఏళ్ల తరువాత కలుసుకున్నాయి.

పాకిస్థాన్ లోని కర్తార్‏పూర్ కారిడార్ ఈ కలయికకు వేదికైంది. రెండు కుటుంబాలు ఆలింగనం చేసుకుని పాటలు పాడుతూ వారి కలయికను పండుగలా జరుపుకున్నారు. పాకిస్థాన్‏లో స్థిరపడిన గురుదేవ్ తన తమ్ముడి ఆచూకీ తెలుసుకునేందకు ఎన్నో ప్రయత్నాలు చేశాడు. భారత్ ప్రభుత్వానికి ఆచూకికోసం లేఖలు రాశాడు. కానీ ఆ ఆశ తీరకుండానే గురుదేవ్ చనిపోయాడు. తన తండ్రి చిరకాల కోరికను నెరవేర్చేందుకు గురుదేవ్ కొడుకు ముహమ్మద్ షరీఫ్ సోషల్ మీడియా ద్వారా అన్వేషణ ప్రారంభించాడు.

సోషల్ మీడియా తలచుకుంటే సాధించలేనిది ఏముంది. ఎట్టకేలకు తన బాబాయి ఆచూకిని తెలుసుకున్నాడు.. వారిని సంప్రదించాడు.. విషయాన్ని తెలియజేశాడు. అనంతరం సిక్కుల పవిత్ర స్థలమైన కర్తార్‏పూర్ సాహిబ్ లో 75 ఏళ్ల తరువాత ఈ రెండు కుటుంబాలు కలుసుకున్నాయి. ఇదే క్రమంలో గురుదేవ్ (గులామ్ ముహమ్మద్) కొడుకు ముహమ్మద్ తమ పూర్వికులు నివసించిన ఇంటిని సందర్శించేందుకు అనుమతి ఇవ్వాలని హర్యానాకు వచ్చేందుకు వీసాలు అందించాలని భారత్ ను విజ్ఞప్తి చేశాడు. మరి ఇండియాలో కూడా మరో పండగ చేసుకొనేందుకు అనుమతి లభిస్తుందో లేదో చూడాలి.