TCongress: ఉత్తమ్ భారీ శపథం.. అత్యాశే అయినా ఎందుకీ సాహసం?!

Kaburulu

Kaburulu Desk

January 3, 2023 | 08:45 AM

TCongress: ఉత్తమ్ భారీ శపథం.. అత్యాశే అయినా ఎందుకీ సాహసం?!

TCongress: వచ్చే ఎన్నికల్లో కోదాడ, హుజూర్ నగర్ నియోజకవర్గాల్లో 50 వేల మెజారిటీకి ఒక్క ఓటు తగ్గినా తాను రాజకీయాలను వదిలేస్తానని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను చెప్పిన మెజారిటీకి ఒక్క ఓటు తగ్గినా రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటానని రాజకీయ సన్యాసం శపథం చేశారు. కోదాడలో ఉత్తమ్ తో పాటు ఆయన భార్య మాజీ, ఎమ్మెల్యే పద్మావతితో కలిసి నిర్వహించిన కాంగ్రెస్ కార్యకర్తల మీటింగ్ లో ఈ వ్యాఖ్యలు చేశారు.

తన 30 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎంతో నిస్వార్థంగా పనిచేశానని చెప్పిన ఉత్తమ్.. ఇన్నేళ్లు రాజకీయాలలో ఉన్నా కనీసం సొంత ఇల్లు కూడా తమకు లేదని.. తమకు పిల్లలు కూడా లేరని.. కోదాడ, హుజూర్ నగర్ నియోజకవర్గ ప్రజలనే తమ పిల్లలుగా భావిస్తూ పనిచేస్తున్నామని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని పేర్కొన్న ఉత్తమ్.. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో కోదాడ, హుజూర్ నగర్ నియోజకవర్గాల్లో 50వేల మెజారిటీ వచ్చి తీరుతుందని.. తాము గెలవడం ఖాయమని స్పష్టం చేశారు.

ఒకరకంగా ఉత్తమ్ చేసిన శపథం చూస్తే సాహసమే అనిపిస్తుంది. ఎందుకంటే కోదాడ, హుజూర్ నగర్ నియోజకవర్గాలలో మళ్ళీ కాంగ్రెస్ గెలవడం అంటే కొంతవరకు నమ్మశక్యం అనిపిస్తుంది. కానీ మళ్ళీ తిరిగి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం.. కోదాడ, హుజూర్ నగర్ నియోజకవర్గాలలో యాభై వేల ఓట్ల మెజారిటీతో గెలవడం అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో సాహసమేనని చెప్పుకోవాలి. అయినా ఉత్తమ్ భారీ భారీ డైలాగులతో ఛాలెంజ్ విసిరారు.

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి బోలెడు అవకాశాలున్నా అన్నిటినీ సొంత పార్టీ నేతలే చిదిమేశారు. గ్రూపు తగాదాలు.. ఓర్వలేని విధానాలు, ఏకపక్ష నిర్ణయాలతో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం కొంచెం కొంచెం ఆ పార్టీని దిగజార్చేశారు. ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి విషయానికి వచ్చినా.. అధిష్టానం ఆయన్ను పీసీసీ చీఫ్ గా చేసినా తెలంగాణలో అధికారంలోకి తీసుకురాలేకపోయారు. అసలు ఈయనకు ఇచ్చినన్ని చాన్సులు కాంగ్రెస్ అధిష్టానం ఎవరికీ ఇవ్వలేదు.. అప్పుడే ఉత్తమ్ వల్లకాలేదు. మరి ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలోకి తెస్తామని.. రెండు నియోజకవర్గాలలో యాభై వేల మెజార్టీకి శపథం చూస్తున్నారు. మరి ఉత్తమ్ ఆశ తీరేదేనా? అత్యాశే అవుతుందా?!