BRS Party: గల్లీల్లో లొల్లి.. బీఆర్ఎస్ పార్టీలో అవిశ్వాస తీర్మానాల రాజకీయం!

Kaburulu

Kaburulu Desk

January 28, 2023 | 10:50 PM

BRS Party: గల్లీల్లో లొల్లి.. బీఆర్ఎస్ పార్టీలో అవిశ్వాస తీర్మానాల రాజకీయం!

BRS Party: ఒకవైపు సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చి జాతీయ స్థాయిలో సత్తా చాటుకోవాలని ఆరాటపడుతున్న సంగతి తెలిసిందే. మొన్ననే ఖమ్మంలో భారీ బహిరంగ సభతో జాతీయ స్థాయిలో ఒక సంకేతాన్నిచ్చిన కేసీఆర్.. త్వరలోనే మహారాష్ట్రలోని నాందేడ్ లో మరో బహిరంగసభకు ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎన్నికల సమయానికి ఎలాగయినా బీఆర్ఎస్ వీలైనంత స్థాయిలో విస్తరించాలని ఆరాటపడుతున్నారు. అయితే, అదంతా నాణానికి ఒక వైపు మాత్రమే.

మరోవైపు బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు తారాస్థాయికి చేరుతున్నాయి. ముఖ్యంగా పలు మున్సిపాలిటీలలో చోటుచేసుకుంటున్న పరిణామాలు మొత్తం పార్టీకి ఇబ్బందికరంగా మారుతున్నాయి. పలు చోట్ల బీఆర్ఎస్‌లో విభేదాలు బయటపడుతుండగా.. కొన్నిచోట్ల విపక్షాలు ఏకమై తిరుగుబాటు చేసేందుకు సిద్దమయ్యాయి. మూడేళ్ల పదవీకాలం పూర్తికావడంతో మున్సిపల్ చైర్‌పర్సన్, వైస్ చైస్‌పర్సన్‌లపై అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెడుతున్నారు.

శనివారం ఒక్కరోజే మూడు చోట్ల అవిశ్వాస తీర్మానాలకు సంబంధించిన ఘటనలు చోటుచేసుకున్నాయి. వికారాబాద్‌ జిల్లాలోని వికారాబాద్, తాండూరు పురపాలక సంఘాల్లో బీఆర్ఎస్‌లో అంతర్గత విభేదాలు ముదిరి పాకాన పడ్డాయి. ప్రస్తుత పురపాలక అధ్యక్షులపై ఒక గ్రూప్‌కు చెందిన సభ్యులు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టటమే ఇందుకు నిదర్శనం. తాండూరు మున్సిపల్ ఛైర్ పర్సన్ స్వప్న పరిమళపై కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు.

జిల్లా కలెక్టర్ నిఖిలకు మొత్తం 23 మంది కౌన్సిలర్ల సంతకాలతో అవిశ్వాస తీర్మానం అందజేశారు. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, ఎంఐఎం, టీజేఎస్ పార్టీలకు చెందిన 23 మంది కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానంపై సంతకాలు చేశారు. ఇదిలా ఉంటే… వికారాబాద్ మంజుల రమేష్‌పై కూడా కలెక్టర్‌కు అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదిస్తూ పత్రాన్ని అందజేశారు. మేడ్చల్ జిల్లా జవహర్‌ నగర్ మేయర్‌పై కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చారు. దాదాపు 20 మంది కౌన్సిలర్లు కలెక్టరేట్‌లో నోటీసులు అందజేశారు.

ఇక, పెద్దఅంబర్‌పేట నగరపంచాయితీ చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్స్‌లపై కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. అయితే చైర్‌పర్సన్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టినవారిలో బీఆర్ఎస్ కౌన్సిలర్లు కూడా ఉన్నారు. చైర్మన్‌, వైఎస్ చైర్మన్‌లపై వ్యతిరేకత, పదవీకాలం పంపకం, అదునుకోసం చూస్తున్న ఆశావాహులు బీఆర్ఎస్‌లో అంతర్గత కుమ్ములాటలకు కారణమవుతున్నట్లుగా తెలుస్తుంది.