AP BRS Party: ‘సంక్రాంతి తర్వాత తట్టుకోలేనంత వత్తిడి’.. కేసీఆర్ మాటల ఆంతర్యమేంటి?

Kaburulu

Kaburulu Desk

January 3, 2023 | 08:19 AM

AP BRS Party: ‘సంక్రాంతి తర్వాత తట్టుకోలేనంత వత్తిడి’.. కేసీఆర్ మాటల ఆంతర్యమేంటి?

AP BRS Party: తెలుగు రాష్ట్రాల రాజకీయాలు మరో కొత్త మలుపు తిరుగుతున్నాయి. ఉద్యమ పార్టీగా.. ఓ ప్రాంత హక్కుల కోసమే పుట్టిన పార్టీ కాస్త ఇప్పుడు జాతీయ నినాదం అందుకొని.. మొన్నటి వరకు కొట్లాడిన అదే ప్రాంతంలో తమ పార్టీ విస్తరణకు సిద్ధమైంది. పదే పదేళ్లు.. కాలం గిర్రున వెనక్కు తిరిగితే.. టీఆర్ఎస్ అనే పార్టీ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తుందని.. కేసీఆర్ అనే వ్యక్తి మళ్ళీ ఇలా తెలంగాణ నినాదాన్ని పక్కనపెట్టి జాతీయ పార్టీగా మార్పులు చేసి అదే ఆంధ్రాలో మళ్ళీ రాజకీయం మొదలు పెడతారని ఊహించడం కూడా కష్టమే.

కానీ.. ఊహకు అందని దానిని కూడా కేసీఆర్ అవలీలగా చేసేస్తారు. అంచనాలతో సంబంధం లేకుండా తన ఆలోచనలను ముందుకు తీసుకెళ్లడం కేసీఆర్ మార్క్ పాలిటిక్స్. ఆయన మాటల్లోనే చెప్పాలంటే ఈ బక్కోడు ఏంటి తెలంగాణ తేవడం ఏంటని ఎగతాళి చేసినా ఆగలేదు.. తనకు చేతనైంది తాను చేసుకుంటూ వెళ్లిపోయారు.. ఫైనల్ గా రాష్ట్రం సిద్దించింది. ఒకనాడు తెలంగాణ ఉద్యమం నుండి గత ఎన్నికలలో కేసీఆర్ ప్రచారం వరకు ఆయన మాటలను వింటే ఆయన ఆంధ్రాలో అడుగు పెట్టడం కానీ.. ఓట్లు అడగడం కానీ జరగదని అనుకుంటారు.. కానీ ఇప్పుడు జరగదనుకున్నదే ఆయన చేస్తున్నారు.

కేసీఆర్ జాతీయ పార్టీ బీఆర్ఎస్ లో ఏపీలో చేరికలు మొదలయ్యాయి. మాజీ ఐఏఎస్‌ అధికారి, సీనియర్‌ నేత తోట చంద్రశేఖర్‌, మాజీ మంత్రి, మాజీ ఐఆర్‌ఎస్‌ అధికారి, రావెల కిశోర్‌ బాబు, మాజీ ఐఆర్‌ఎస్‌ అధికారి పార్థసారథితో పాటు పలువురు ఈ నెల 2న బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. ఇక, ఏపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా మాజీ ఐఏఎస్‌ తోట చంద్రశేఖర్‌ను నియమించిన కేసీఆర్.. మాజీ మంత్రి రావెల కిశోర్‌బాబు ఢిల్లీ కేంద్రంగా జాతీయస్థాయిలో పనిచేస్తారని వెల్లడించారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.

సంక్రాంతి మరునాటి నుంచి ఏపీ బీఆర్‌ఎస్‌లో తట్టుకోలేనంత ఒత్తిడి ఉంటుంది. ఏపీలో ఆశ్చర్యపరిచే చేరికలు త్వరలోనే ఉంటాయి. గొప్ప వ్యక్తులు, సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు చాలామంది ఫోన్‌ చేసి బీఆర్ఎస్ లో చేరుతామని చెప్తున్నారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యేలే అయినా రాష్ట్రంలో ఫిట్టింగ్‌ లేదని అంటున్నారు. సంక్రాంతి తర్వాత ఏపీలో కార్యకలాపాలు పెరిగి భారీ స్థాయిలో చేరికలు ఉంటాయని కేసీఆర్‌ తెలిపారు. ఊహకు అందనంత మంది బీఆర్‌ఎస్‌లో చేరుతారని కేసీఆర్ చెప్పుకొచ్చారు.

కేసీఆర్ స్పీచ్ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ గా మారింది. ఊహకు అందనంత చేరికలు అంటే.. ఇది ఏపీలో ఏ పార్టీకి గండి కొట్టబోతుంది? సిట్టింగ్ ఎమ్మెల్యేలు అంటే ఏ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కేసీఆర్ తో టచ్ లో ఉన్నారు? ఏపీలో కేసీఆర్ అడుగుపెడితే ఏ పార్టీ సహకరిస్తుంది? ఏ పార్టీ టార్గెట్ చేస్తుంది? ఇలా ఎన్నెన్నో చర్చలు మొదలయ్యాయి. మరికొద్ది రోజులు ఆగితే కానీ బీఆర్ఎస్ రేంజి ఏంటో.. ఏపీలో దాని ప్రభావం ఎలా ఉండబోతుందో అంచనా వేసుకోవచ్చు.